BIG BREAKING: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-17 09:14:15  IST  )

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు ఉరిశిక్ష విధించింది.

BIG BREAKING: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఉరిశిక్ష విధించింది. ఢాకా అల్లర్ల కేసులో సుదీర్ఘ విచారణ చేసిన న్యాయస్థానం.. ఇరుపక్షాల వాదనలు విన్నాక ఆమెను దోషిగా తేల్చింది. నేర నిర్థారణ కావడంతో 458 పేజీల తీర్పును వెలువరించింది. గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా.. షేక్ హసీనా ప్రజలపై కాల్పులకు ఆదేశించడంతోనే ఈ దారుణం జరిగిందని పిటిషనర్ న్యాయస్థానానికి తెలిపారు.

గతేడాది జులై, ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మరణించినట్లు ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిని చంపేయాలని ఆదేశించడం దారుణమన్నారు. షేక్ హసీనా తీరు మానవత్వానికే మాయని మచ్చ అని, అమాయకుల్ని కాల్చి చంపాలని ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ఆగస్టు 5వ తేదీన ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. గాయపడినవారికివైద్యం అందించేందుకు కూడా నిరాకరించడం హేయమన్నారు. ఈ కేసులో తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలని న్యాయమూర్తులు కోరారు.

ఢాకా అల్లర్ల కేసులో నేడు తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ లో, ముఖ్యంగా ఢాకాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై వెంటనే కాల్పులు జరపాలని ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు ఇచ్చారు.

ఇంకా భారత్ లోనే..

కాగా.. ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లోని ఢిల్లీలో ఒక రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. గతేడాది ఆగస్టు 5న జరిగిన ఆందోళనల తర్వాత బంగ్లాదేశ్ ను వీడిన ఆమె.. భారత్ కు వచ్చారు. తీర్పుకు ముందు ఆమె సోషల్ మీడియా ద్వారా తన దేశాన్ని ఉద్దేశించి ఒక సందేశాన్నిచ్చారు. తనకెలాంటి శిక్షపడినా అవామీ లీగ్ కార్యకర్తలెవరూ బాధపడొద్దని కోరారు. ఏ తీర్పు ఇచ్చినా తనకు సంబంధం లేదన్నారు. దేవుడిచ్చినప్రాణం.. ఆయనే తీసుకుంటాడని, అప్పటి వరకూ తన దేశ ప్రజలకోసం పనిచేస్తానన్నారు. దేశం కోసం తల్లిదండ్రులు, తోబుట్టువులను పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story