గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చమురు నౌకపై డ్రోన్ దాడి.. భారతీయ నావికుడు దుర్మరణం

by Ramesh Naini |

పర్షియన్ గల్ఫ్ ద్వారమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' గుండా వెళ్లే నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చమురు నౌకపై డ్రోన్ దాడి.. భారతీయ నావికుడు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో సోమవారం (మార్చి 2) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు పదార్థాలతో కూడిన 'డ్రోన్ బోట్' ఒక చమురు నౌకను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో, అందులో పనిచేస్తున్న ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది. ఒమన్ రాజధాని మస్కట్ తీరానికి సమీపంలో ఈ దాడి జరిగినట్లు ఒమన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న 'MKD VYOM' అనే చమురు నౌకపైకి పేలుడు పదార్థాలతో నిండిన డ్రోన్ బోట్ దూసుకువచ్చి ఢీకొట్టింది. ఈ ధాటికి నౌకలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నౌకలోని ఒక సిబ్బంది మరణించారని, ఆయన భారతీయుడని అధికారులు ధృవీకరించారు. కాగా, ఈ దాడిపై భారత విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది. మరణించిన నావికుడి కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది.

నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరికలు

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధ వాతావరణం మధ్య ఈ దాడి జరగడం కలకలం రేపుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు భారీగా వైమానిక దాడులు ప్రారంభించిన నేపథ్యంలో, దానికి ప్రతిచర్యగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్ ద్వారమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' గుండా వెళ్లే నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా పలు డ్రోన్ దాడులు జరిగినట్లు నివేదికలు అందుతున్నాయి.

Next Story