ఈ మార్గాల ద్వారా ఉక్రెయిన్ విడిచి పెట్టండి.. భారత ఎంబసీ సూచన

by Dishanational4 |
ఈ మార్గాల ద్వారా ఉక్రెయిన్ విడిచి పెట్టండి.. భారత ఎంబసీ సూచన
X

కీవ్: ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితుల రీత్యా భారతీయులందరూ వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటి వెళ్లడానికి భారత్ ఎంబసీ 5 మార్గాలు సూచించింది. భారత విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఆదివారం ఉక్రెయిన్‌లోని భారతీయుల ప్రయోజనార్థం ఒక ప్రకటన జారీ చేశారు. ఉక్రెయిన్-హంగరీ, ఉక్రెయిన్-స్లొవేకియా సరిహద్దు, ఉక్రెయిన్-మాల్దోవా, ఉక్రెయిన్-పోలండ్, ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుల గుండా భారతీయులు సురక్షింతగా ఉక్రెయిన్ దాటి వెళ్లవచ్చని తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దులు దాటి వెళుతున్న భారతీయులు తమ ప్రయాణం పొడవునా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఉక్రెయిన్-హంగరీ సరిహద్దులో గస్తీ కేంద్రాలు జకర్‌పటియా రీజియన్‌లో ఉన్నాయని, ఇక్కడి చోప్ నగరం నుంచి రైలు మార్గం ద్వారా ఉక్రెయిన్ దాటి వెళ్లవచ్చని పేర్కొన్నారు. సరిహద్దులు దాటాలంటే భారత జాతీయులు ఉక్రెయిన్‌లో నివాస అనుమతి ఉంటున్నట్లు తెలిపే చెల్లుబాటయ్యే వీసాను కలిగి ఉండాలని తెలిపారు. స్టూడెంట్ సర్టిఫికెట్ లాంటిది ఉంటే మరీ మంచిదని తెలిపారు. అప్పటికే విమాన టికెట్ తీసుకుని ఉంటే దాన్ని కూడా సరిహద్దు గస్తీ కేంద్ర వద్ద చూపాలన్నారు. ఉక్రెయిన్ పొరుగు దేశాల వీసా లేనివారు కీవ్ లోని ఆయా దేశాల ఎంబసీల్లో ఆయా దేశాల ట్రాన్సిట్ వీసాను తప్పకుండా తీసుకోవాలని సూచించారు. క్రిమియాలోని రోడ్డు వంతెనను పేల్చి వేయడంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకర రూపం దాల్చింది. రష్యా తాజా దాడిలో ఉక్రెయిన్ లోని 30 శాతం విద్యుత్ కేంద్రాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed