నేను అందుకోసమే ఎన్నికల్లో పోటీ చేయట్లేదు : ప్రియాంకాగాంధీ

by Shamantha N |
నేను అందుకోసమే ఎన్నికల్లో పోటీ చేయట్లేదు : ప్రియాంకాగాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ. దేశవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారం చేయడంపైనే దృష్టి సారించానని.. అందుకే ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తెలిపారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. తాను, రాహుల్ ఇద్దరూ పోటీ చేస్తే అది బీజేపీకి మేలు చేస్తుందని అన్నారు.

"నేను గత 15 రోజులుగా రాయ్‌బరేలిలో ప్రచారం చేస్తున్నాను. గాంధీ కుటుంబానికి రాయబరేలీతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. అందుకే ఇక్కడికి వచ్చి వారితో మాట్లాడాలని ప్రజలు కోరుకుంటారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఎన్నికలు గెలవలేం." అని ప్రియాంక గాంధీ అన్నారు.

తామిద్దరం పోటీ చేసి ఉంటే 15 రోజుల పాటు తమ సొంత నియోజకవర్గంలోనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. అందుకే పోటీ చేయట్లేదని తెలిపారు. దేశమంతటా ప్రచారం చేయడం సముచితమని భావించామని పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వకుండా దాటవేశారు ప్రియాంక గాంధీ. పార్ల‌మెంటేరియన్‌ని కావాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనీ తానెప్పుడూ అనుకోలేదని తెలిపారు. పార్టీ కోసం ఏ పాత్ర పోషించేందుకైనా సిద్ధంగా ఉన్నానని వివరించారు. తాను ఎన్నికల్లో పోరాడాలని ప్రజలు భావిస్తే పోటీ చేస్తానని తెలిపారు.

ఓడిపోతామనే భయంతో ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీజేపీ ఆరోపించింది. అయితే, తమ పార్టీ బీజేపీ వ్యూహంతో నడవట్లేదని అన్నారు. రాహుల్, తాను ఇద్దరం పోటీ చేస్తే అది బీజేపీకి లాభదాయకంగా ఉంటుందని.. ప్రచారానికి ఎవరూ అందుబాటులో ఉండని తెలిపారు.

రాహుల్ అమేథీ నుంచి పారిపోయారన్న వ్యాఖ్యలపై ప్రియాంక స్పందించారు. అమేథీ, రాయ్ బరేలీలను ఎప్పటికీ వదిలిపెట్టదని.. ఆ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ కు ముఖ్యమైనవని అన్నారు. గుజరాత్‌లోని వడోదర ఎన్నికల్లో ప్రధాని మోడీ ఎందుకు పోటీ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. “ప్రధాని మోడీ భయపడుతున్నారా? 2014 తర్వాత వడోదర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? గుజరాత్ నుంచి పారిపోయారా?" ప్రియాంక అన్నారు.

Next Story