ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణులను అందించిన భారత్

by Disha Web Desk 17 |
ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణులను అందించిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ద్వైపాక్షిక రక్షణ సహకారంలో భాగంగా భారత్ మొదటి దశ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, లాంచర్‌లను శుక్రవారం ఫిలిప్పీన్స్‌కు సరఫరా చేసింది. రెండు దేశాల మధ్య 2022 జనవరిలో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం ఖరారైంది. దాదాపు రెండు సంవత్సరాల తరువాత మొదటి దశ ఎగుమతి జరిగింది. బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేసిన తొలి ఆర్డర్ ఇదే కావడం గమనార్హం. క్షిపణులు, లాంచర్లతో కూడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) C-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానం గురువారం అర్థరాత్రి నాగ్‌పూర్ నుండి బయలుదేరి, ఏప్రిల్ 19 ఉదయం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు చేరుకుంది.

చైనా-ఫిలిప్పీన్స్‌ మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణులు ఫిలిప్పీన్స్‌‌కు చాలా ముఖ్యమైన రక్షణ ఆయుధంగా ఉపయోగపడుతాయి. ఇవి పశ్చిమ ఫిలిప్పైన్ సముద్రంలో తీర ప్రాంత రక్షణ రెజిమెంట్ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతాయి. ఈ ప్రాంతం చైనాతో వివాదాలకు కేంద్రంగా ఉంది. భారత్-రష్యా కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా గుర్తింపు పొందింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, బ్రహ్మోస్ ఒప్పందం కీలక రక్షణ భాగస్వామిగా భారత్ స్థాయిని పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. 2023-24లో భారతదేశ రక్షణ ఎగుమతులు రూ. 21,083 కోట్లుగా ఉన్నాయి, ఇది గత ఏడాదితో పోలిస్తే 32.5 శాతం ఎక్కువ.

Next Story

Most Viewed