పెంటగాన్‌ వద్ద పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. ఇరాన్‌పై అమెరికా భారీ దాడికి సన్నాహమా?

by Ramesh Naini |

అమెరికా రక్షణ కార్యాలయం ‘పెంటగాన్‌’ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

పెంటగాన్‌ వద్ద పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. ఇరాన్‌పై అమెరికా భారీ దాడికి సన్నాహమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు ఇచ్చిన గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 10 రోజులు పొడిగించిన నేపథ్యంలో, అమెరికా రక్షణ కార్యాలయం ‘పెంటగాన్‌’ ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెంటగాన్ చుట్టుపక్కల అర్ధరాత్రి వేళ పిజ్జా ఆర్డర్లు అనూహ్యంగా పెరగడం, ఇరాన్‌పై అమెరికా చేయబోయే భారీ సైనిక ఆపరేషన్‌కు సంకేతమని రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏమిటి ‘పెంటగాన్ పిజ్జా థియరీ’ ?

స్థానిక ఫుడ్ డెలివరీలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ ప్రకారం, గురువారం రాత్రి పెంటగాన్ సమీపంలోని పాపా జాన్స్‌లో 296 శాతం, డొమినోస్‌లో 208 శాతం, పిజాటోలో 200 శాతం మేర ఆర్డర్లు పెరిగాయి. 1970వ దశకం నుంచి రక్షణ రంగంలో ఈ ‘పిజ్జా థియరీ’ ప్రచారంలో ఉంది. అమెరికా సైన్యం ఏదైనా భారీ ఆపరేషన్ లేదా యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడు.. రక్షణ, ఇంటెలిజెన్స్ అధికారులు రాత్రంతా కార్యాలయాల్లోనే ఉండి అత్యవసర సమావేశాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో వారు పిజ్జా వంటి క్విక్ ఫుడ్‌పై ఆధారపడతారు. గతంలో వెనెజువెలా ఆపరేషన్ సమయంలో కూడా ఇలాగే జరిగిందని, ఇప్పుడు ఇరాన్‌పై దాడికి ఇదే సంకేతమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గడువు పెంపు.. ఓ ఎత్తుగడ మాత్రమేనా?

ఇరాన్‌కు పది రోజుల గడువు ఇవ్వడం వెనుక ట్రంప్ వ్యూహం దాగి ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. శాంతి చర్చల పేరుతో కాలాన్ని సాగదీస్తూనే, పశ్చిమాసియాకు అదనంగా 10 వేల మంది సైనికులను పంపేందుకు అమెరికా ఈ సమయాన్ని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇరాన్ సామర్థ్యాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా సైన్యం ప్రణాళికలు రచిస్తోందని, ‘పిజ్జా మీటర్’ సూచిస్తున్న సంకేతాలు నిజమైతే ఏ క్షణంలోనైనా అమెరికా దళాలు రంగంలోకి దిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Next Story