ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన మైలురాయి

by Shamantha N |

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో భాగంగా క్రొయేషియాతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. క్రొయేషియా ప్రధాని ఆండ్రేజ్ ప్లెన్కోవిక్ తో మోడీ భేటీ అయినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.

ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన మైలురాయి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో భాగంగా క్రొయేషియాతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. క్రొయేషియా ప్రధాని ఆండ్రేజ్ ప్లెన్కోవిక్ తో మోడీ భేటీ అయినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. G7 శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగానే సైప్రస్, కెనడా, క్రొయేషియాల్లో పర్యటించారు. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ లో ఆండ్రేజ్ ప్లెన్కోవిక్ తో బుధవారం మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మోడీ మాట్లాడారు. మోడీ మాడ్లాడుతూ.. “ఈ అందమైన జాగ్రెబ్ నగరానికి వచ్చే అవకాశం నాకు లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ సందర్శన చిన్నదే అయినప్పటికీ, నగర సంస్కృతి, ప్రజల జీవనశైలిని చూస్తుంటే.. నేను ఇంట్లోనే ఉన్నట్లు భావించాను” అని అన్నారు. అంతేకాకుండా, ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నట్లు తెలిపారు. భారతదేశం-క్రొయేషియా సంబంధాలను బలోపేతం చేసే అనేక రంగాల్లో కలిసి పనిచేయడానికి కొత్త మార్గాలను తెరిచే అనేక ముఖ్యమైన నిర్ణయాలు మేము తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్శన ఇరుదేశాల ఉమ్మడి స్నేహం, విస్తృత సహకార ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

ప్లెన్ కోవిక్ ఏమన్నారంటే?

భారతదేశం- క్రొయేషియా మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్లెన్‌కోవిక్‌ హైలెట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. "మన భాగస్వామ్యం నమ్మకం, పరస్పర గౌరవం, ఉమ్మడి ఆశయంలో పాతుకుపోయి వృద్ధి చెందుతూనే ఉండాలి. మన ప్రజలు ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం, ఒకరినుంచు ఒకరు స్ఫూర్తిపొందాలి. ఆవిష్కరణ, అవగాహన, శాంతి మార్గంలో కలిసి నడవడం కొనసాగించాలి. భవిష్యత్తులో ఇరు దేశాల భాగస్వామ్యం విజయం సాధించాలి. మోడీ సహాయానికి, ఇరుదేశాల మధ్య స్నేహానికి ఇదే నిదర్శనం, జై హింద్" అని అన్నారు. క్రొయేషియా పర్యటన తర్వాత సెంట్రల్ యూరోపియన్ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానమంత్రిగా మోడీ నిలిచారు. ఇరుదేశాలు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కల్చరల్ ఎక్ఛేంజ్ ప్రోగ్రామ్, జాగ్రెబ్ విశ్వవిద్యాలయ విస్తరణ వంటి రంగాలను విస్తృతంగా కవర్ చేస్తూ నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయని రాయబార ప్రతినిధి తన్మయ్ లాల్ మీడియా సమావేశంలో తెలిపారు.

Next Story