మయన్మార్‌లో భయానక పేలుడు.. చిన్నారులతో సహా 46 మంది మృతి!

by Ramesh Naini |   (  Updated:2026-05-31 17:24:05  IST  )

ఈశాన్య మయన్మార్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన భారీ పేలుడులో ఆరుగురు చిన్నారులు సహా 46 మంది దుర్మరణం పాలయ్యారు.

మయన్మార్‌లో భయానక పేలుడు.. చిన్నారులతో సహా 46 మంది మృతి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈశాన్య మయన్మార్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన భారీ పేలుడులో ఆరుగురు చిన్నారులు సహా 46 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. గనుల తవ్వకాల కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని అధికారులు నిర్ధారించారు. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. చైనా సరిహద్దుకు సమీపంలోని నామ్‌ఖామ్ టౌన్‌షిప్ పరిధిలోని కౌంగ్‌టుప్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రాంతం ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక సాయుధ సంస్థ అయిన ‘తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ’ (TNLA) ఆధీనంలో ఉంది. గనులు, క్వారీ తవ్వకాల కోసం ఓ భవనంలో ‘జెలిగ్నైట్’ అనే ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను నిల్వ ఉంచినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

పేలుడు తీవ్రతకు ఆకాశంలోకి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వందకు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల నుంచి 46 మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి వైద్య సదుపాయం అందిస్తున్నారు. పేలుడుకు గల కచ్చితమైన కారణాలపై స్థానిక అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Next Story