Heavy rains: ముంబయిలో భారీ వర్షాలు.. పొంగిన పవాయ్ సరస్సు

by Shamantha N |

దేశ ఆర్థిక రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి మొదలైన వర్షాలు బుధవారం ఉదయం వరకు కురుస్తూనే ఉన్నాయి.

Heavy rains: ముంబయిలో భారీ వర్షాలు.. పొంగిన పవాయ్ సరస్సు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ ఆర్థిక రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి మొదలైన వర్షాలు బుధవారం ఉదయం వరకు కురుస్తూనే ఉన్నాయి. కుండపోత వర్షాల ప్రభావం వల్ల నగరంలోని ప్రముఖ ప్రాంతాలు CSMT, బల్లార్డ్ ఎస్టేట్, నారీమన్ పాయింట్ తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జాం అవుతోంది. ముంబయికి భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

పొంగిన పవాయ్ సరస్సు

ఈ వర్షాల ప్రభావంతో పవాయ్ సరస్సు బుధవారం ఉదయం ఉప్పొంగింది. బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (BMC) అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. పవాయ్ సరస్సు తీరాన్ని నీరు దాటి ప్రవహిస్తున్న దృశ్యాలను BMC సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. గత 48 గంటల్లో క్యాచ్‌మెంట్ ఏరియాలో కురిసిన భారీ వర్షాల కారణంగా సరస్సు నీటి మట్టం గరిష్ఠ స్థాయి 195.10 అడుగులకు చేరుకుంది. వర్షాల ధాటికి ముంబయి డ్రైనేజీ వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. వరదల ప్రమాదం, ట్రాఫిక్ అంతరాయాలు, విద్యుత్ సరఫరాలో ఆటంకం లాంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో మున్సిపల్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నారు. అత్యవసర సమాచారం అధికారులకు అందించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Next Story