ఆరు నెలల గరిష్ఠానికి ఆహార ధరలు.. యుద్ధం నడుమ ఆహార ముప్పు పొంచి ఉందా?

by Naga Rani Yarlagadda |

ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు ఆరు నెలల గరిష్ఠానికి చేరినట్లు FAO వెల్లడించింది.

ఆరు నెలల గరిష్ఠానికి ఆహార ధరలు.. యుద్ధం నడుమ ఆహార ముప్పు పొంచి ఉందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఆహార వస్తువుల ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. గత మార్చి నెలలో అంతర్జాతీయ ఆహార ధరలు 2025 సెప్టెంబర్ తర్వాత అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) వెల్లడించింది. వరుసగా రెండో నెలలోనూ ఈ పెరుగుదల నమోదు కావడం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడిని సూచిస్తోంది.

పెరిగిన ధరల సూచీ (Food Price Index)

ముఖ్యమైన ఆహార వస్తువుల ధరలను ట్రాక్ చేసే 'ఎఫ్ఏఓ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్' మార్చిలో సగటున 128.5 పాయింట్లకు చేరింది. ఇది ఫిబ్రవరితో పోలిస్తే 2.4%, గత ఏడాదితో పోలిస్తే 1% పెరుగుదల. ప్రధానంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇంధన ధరలు పెరగడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.

ముడి చమురు.. ఎరువుల సెగ

ఆహార ద్రవ్యోల్బణానికి ఇంధన ధరలు ప్రధాన చోదక శక్తిగా మారాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల రవాణా, ఉత్పత్తి ఖర్చులు భారమయ్యాయి. చమురు ధరల పెరుగుదల వల్ల బయో ఫ్యూయల్స్ (జీవ ఇంధనాలు)కు డిమాండ్ పెరిగింది. దీనివల్ల వెజిటబుల్ ఆయిల్స్ వంటి వస్తువుల ధరలు పెరిగాయి. ఎరువుల ధరలు పెరగడం వల్ల రాబోయే సీజన్లలో రైతుల సాగు నిర్ణయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఏ వస్తువు ధర ఎంత పెరిగింది?

గోధుమలు: అమెరికాలో పంట దిగుబడి తగ్గడం, ఎరువుల ధరల వల్ల ఆస్ట్రేలియాలో సాగు తగ్గడంతో గోధుమ ధరలు 4.3% పెరిగాయి. వెజిటబుల్ ఆయిల్స్ అత్యధికంగా 5.1% పెరుగుదల నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇవి 13.2% ప్రియమయ్యాయి. బ్రెజిల్ తన చెరకును ఎగుమతులకు కాకుండా ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడంతో చక్కెర ధరలు 7.2% పెరిగాయి. పాల ఉత్పత్తులు 1.2%, మాంసం ధరలు 1% పెరిగాయి. వరి (బియ్యం) ధరలు మాత్రం 3% మేర తగ్గాయి.

ముందున్న ముప్పు?

ప్రపంచవ్యాప్త గోధుమ ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 1.7% తగ్గి, 820 మిలియన్ టన్నులకు పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు. భౌగోళిక ఉద్రిక్తతలు మరో 40 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే.. రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించడం లేదా తక్కువ ఖర్చుతో కూడిన ఇతర పంటల వైపు మళ్లడం వల్ల ఆహార సరఫరా మరింత తగ్గి ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఎఫ్ఏఓ చీఫ్ ఎకనమిస్ట్ మాక్సిమో టోరెరో హెచ్చరించారు.

Next Story