- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంధన సంక్షోభం: థాయ్‌లాండ్‌లో 4 రోజుల పనిదినాలే.. వియత్నాంలో వర్క్ ఫ్రమ్ హోమ్!
తీవ్ర ఇంధన కొరత, ఆకాశాన్నంటుతున్న ధరల నేపథ్యంలో థాయ్‌లాండ్, వియత్నాం ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, హోర్ముజ్ జలసంధిలో తలెత్తిన సంక్షోభం ఆగ్నేయాసియా దేశాలను వణికిస్తోంది. తీవ్ర ఇంధన కొరత, ఆకాశాన్నంటుతున్న ధరల నేపథ్యంలో థాయ్‌లాండ్, వియత్నాం ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ఆదేశాలు జారీ చేయడంతో పాటు పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇంధనం కోసం పశ్చిమాసియా దేశాలపై ఎక్కువగా ఆధారపడే వియత్నాం ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి చివరి నుండి అక్కడ పెట్రోల్ ధరలు 32%, డీజిల్ 56%, కిరోసిన్ ఏకంగా 80% పెరిగాయి. అనవసర ప్రయాణాలను తగ్గించి, ఇంధనాన్ని ఆదా చేసేందుకు వీలైనంత వరకు ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' అవకాశం ఇవ్వాలని పారిశ్రామిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ స్థానిక సంస్థలను కోరింది. ఇంధన నిల్వలను భద్రపరిచేలా సహకరించాలని వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ మిన్.. కువైట్, ఖతార్, యూఏఈ దేశాధినేతలతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు.
థాయ్‌లాండ్‌లో 4 రోజుల పనిదినాలే!
ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం 'ఎమర్జెన్సీ' తరహా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిదినాలను అమలు చేయాలని నిర్ణయించింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుండే పని చేయాలని ఆదేశించింది. రెండు దేశాల ప్రభుత్వాలు తమ పౌరులకు, అధికారులకు పలు కీలక సూచనలు చేశాయి. సొంత వాహనాల వాడకాన్ని తగ్గించి, బస్సులు, రైళ్ల వంటి ప్రజా రవాణాను వినియోగించాలని కోరాయి. దగ్గరి ప్రయాణాలకు సైకిళ్లను వాడాలని, కార్యాలయాలకు వెళ్లే వారు కార్‌పూలింగ్ (వాహన భాగస్వామ్యం) పద్ధతిని అనుసరించాలని సూచించాయి. అధికారులు తమ విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని లేదా నివారించాలని స్పష్టం చేశాయి. ప్రస్తుతం వియత్నాం రాజధాని హనోయి వంటి నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడే వరకు ఈ పొదుపు చర్యలు పాటించక తప్పదని ఇరు దేశాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.






