Life prison : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి ‘యావజ్జీవ శిక్ష’..

by Ramesh Naini |

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అక్కడి న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది.

Life prison : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి ‘యావజ్జీవ శిక్ష’..
X

దిశ, డైనమిక్ బ్యూరో : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ (Yoon Suk Yeol)కు అక్కడి న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. 2024 డిసెంబరులో చట్టవిరుద్ధంగా మార్షల్ లా (సైనిక పాలన) విధించేందుకు ప్రయత్నించిన కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పార్లమెంట్ సముదాయంలోకి దళాలను పంపి, నేషనల్ అసెంబ్లీని స్తంభింపజేయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమైన 'తిరుగుబాటు' కిందకే వస్తుందని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. ప్రత్యేక ప్రాసిక్యూటర్లు యూన్‌కు 'మరణశిక్ష' విధించాలని కోరినప్పటికీ, న్యాయస్థానం యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. అధికారాన్ని సుదీర్ఘకాలం తన గుప్పిట్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే, ఎలాంటి అత్యవసర పరిస్థితి లేకపోయినా యూన్ సైనిక పాలన విధించారని ప్రాసిక్యూషన్ వాదించింది.

నేను ఏ తప్పూ చేయలేదు..

2024 డిసెంబర్ 3న అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఆకస్మికంగా దేశంలో మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఆరు గంటల పాటు కొనసాగిన ఈ సైనిక పాలన ప్రయత్నం, ప్రజల, ప్రజాప్రతినిధుల తీవ్ర నిరసనలతో విఫలమైంది. ఈ క్రమంలో ఆయన రాజ్యాంగాన్ని కాలరాశారనే ఆరోపణలతో గత ఏడాది జనవరిలో అభిశంసనకు గురై జైలుకు వెళ్లారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. ఇది పౌరులను అణచివేయడానికి చేసిన ప్రయత్నం కాదు, స్వేచ్ఛను, రాజ్యాంగ క్రమాన్ని కాపాడటానికి చేసిన ప్రయత్నం మాత్రమే’ అని యూన్ తన చివరి స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ యూన్ సుక్ యోల్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నారు. జాతీయ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారమైన ఈ తీర్పు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Next Story