Kolkata: కాళ్ల మీద పడి ప్రాధేయపడినా.. కనికరించలేదు

by Shamantha N |   (  Updated:2025-06-27 11:57:50  IST  )

కోల్ కతాలోని లా కాలేజీలో లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా.. కోర్టు ఐదు రోజులు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది.

Kolkata: కాళ్ల మీద పడి ప్రాధేయపడినా.. కనికరించలేదు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతాలోని లా కాలేజీలో లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం కేసులో నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా.. కోర్టు ఐదు రోజులు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. సదరు మహిళ స్టూడెంట్ ఫిర్యాదు ఆధారంగా దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ప్రధాన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసిపి) దక్షిణ కోల్‌కతా జిల్లా మాజీ విద్యార్థి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31)గా గుర్తించారు. మొదటి సంవత్సరం విద్యార్థి జైబ్ అహ్మద్ (19), మరొక విద్యార్థి 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీని పోలీసులు అరెస్టు చేశారు.

కాళ్లు మొక్కినా వదల్లేదు

24 ఏళ్ల మహిళ స్టూడెంట్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పరీక్షకు సంబంధించిన ఫారాలను నింపడానికి కాలేజీకి వచ్చింది. ఆమె మొదట కాలేజీ యూనియన్ గదిలో కూర్చుంది. ప్రధాన నిందితుడు మిశ్రా తనను వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడని కానీ తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి తిరస్కరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టారని ఆమె ఆరోపించింది. నిందితుడు తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లాడని, తన బాయ్‌ఫ్రెండ్‌ను చంపుతానని, తన తల్లిదండ్రులను అరెస్టు చేయిస్తానని బెదిరించాడని పోలీసుల విచారణలో పేర్కొంది. కాళ్లు మొక్కినా అతను తనను వదలలేదని వాపోయింది. నన్ను బలవంతంగా గార్డ్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారని విలపించింది. అంతేకాకుండా ఈ ఘటనను వీడియో రికార్డింగ్ చేశాడని తాను సహకరించకపోతే లీక్ చేస్తానని బెదిరించాడని సదరు స్టూడెంట్ పోలీసులకు తెలిపింది. తాను ప్రతిఘటించడంతో హాకీ స్టిక్ తో కొట్టారని వాపోయింది. కాగా నిందితులు మిశ్రా, అహ్మద్ లను గురువారం సాయంత్రం దక్షిణ కోల్ కతాలోని కస్బాలో అరెస్టు చేశారు. మూడో నిందితుడు ముఖర్జీని గురువారం తెల్లవారుజామున 12.30కు అతడి నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. వీరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

తృణమూల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఈ సంఘటన తర్వాత తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికార పార్టీ ‘ఎక్స్’ ట్విటర్ లో పేర్కొంది. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో సహా పలువురు తృణమూల్ నాయకులతో ఫొటోలు దిగినవి ఉన్నాయని బీజేపీ విమర్శలు చేస్తోంది. పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుండే హక్కు లేదని మండిపడ్డారు. పోలీసులు శాంతి భద్రతలను అదుపు చేయడంతో విఫలమవుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మహిళలకు భద్రత కరువైంది: బీజేపీ ఐటీ సెల్

ఈ సంఘటన భయంకరమైనదని ఆర్జీకర్ అత్యాచార హత్యను గుర్తుచేస్తూ, బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై నేరాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని మమతా బెనర్జీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోతుందని ఆరోపించారు. ఆరు నెలల కిందట ఆర్జీకర్ వైద్య కళాశాలలో జరిగిన దారుణ ఘటన మరవకముందే కోల్ కతాలో లా స్టూడెంట్ పై అత్యాచారం జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ మహిళా కమిషన్ (NCW) ఈ సంఘటన గురించి కోల్‌కతా పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది. త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశించింది.

Next Story