- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్‌స్టీన్ ఫైల్స్ ఆరోపణలు.. బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్!
లైంగిక నేరాలకు పాల్పడి మరణించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాల నేపథ్యంలో బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బ్రిటన్ రాజకుటుంబంలో ఎప్‌స్టీన్ ఫైల్స్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. లైంగిక నేరాలకు పాల్పడి మరణించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాలు, ఎప్‌స్టీన్ ఫైల్స్ వెలుగులోకి తెచ్చిన సంచలన విషయాల నేపథ్యంలో బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ (ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) అరెస్ట్ అయినట్లు తెలిసింది. గురువారం ఆయన 66వ పుట్టిన రోజు నాడే ఈ పరిణామం చోటుచేసుకుంది. అధికార దుర్వినియోగానికి (misconduct in public office) పాల్పడ్డారనే అనుమానంతో 66 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు 'థేమ్స్ వ్యాలీ' పోలీసులు తెలిపారు. బ్రిటన్ చట్టాల నిబంధనల ప్రకారం, నేరం రుజువైతే ఈ ఆరోపణలకు గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశం ఉంది. బ్రిటన్ చట్టాల ప్రకారం నిందితుడి పేరును పోలీసులు అధికారికంగా వెల్లడించనప్పటికీ, అరెస్టయింది ఆండ్రూనే అని అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది.
ఆరోపణలను ఖండించిన ఆండ్రూ..
ఈ కేసు పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర ఆసక్తిని తాము అర్థం చేసుకోగలమని, సరైన సమయంలో తదుపరి వివరాలు వెల్లడిస్తామని అసిస్టెంట్ చీఫ్ ఆఫీసర్ ఆలివర్ రైట్ తెలిపారు. సమగ్రమైన పరిశీలన తర్వాతే ఈ అధికార దుర్వినియోగం ఆరోపణలపై విచారణ ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. ఈ విచారణలో భాగంగా బెర్క్‌షైర్, నార్ఫోక్‌లలోని రెండు నివాసాల్లో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు సాండ్రింగ్‌హామ్‌లోని ఆండ్రూ ఇంటికి పోలీసు వాహనాలు చేరుకున్న దృశ్యాలను మీడియా కెమెరాలు బంధించాయి.ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాలపై వస్తున్న ఆరోపణలను ఆండ్రూ మొదటినుంచీ ఖండిస్తూనే ఉన్నారు. అయితే, అతడితో స్నేహం చేసినందుకు బాధపడుతున్నట్లు గతంలోనే ఆయన అంగీకరించారు. దివంగత క్వీన్ ఎలిజబెత్ II కుమారుడు, ప్రస్తుత రాజు కింగ్ చార్లెస్ III సోదరుడైన ఆండ్రూపై.. ఎప్‌స్టీన్ వివాదం కారణంగా కొన్నేళ్లుగా తీవ్ర స్థాయిలో ఒత్తిడి నెలకొంది.
చరిత్రలో అరుదైన ఘటన..
బ్రిటన్ రాజకుటుంబంలోని కీలక వ్యక్తులు ఇలా అరెస్ట్ కావడం అత్యంత అరుదైన విషయంగా ప్రజలు భావిస్తున్నారు. గతంలో 2002లో ఆండ్రూ సోదరి అయిన ప్రిన్సెస్ అన్నే పెంపుడు కుక్క 'డాటీ' ఇద్దరు పిల్లలను కరవడంతో, ఆమెను 'డేంజరస్ డాగ్స్ యాక్ట్' కింద దోషిగా నిర్ధారించారు. బ్రిటన్ చరిత్రలో ఓ రాజకుటుంబీకురాలిపై క్రిమినల్ నేరం రుజువు కావడం అదే తొలిసారి అని అప్పట్లో అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తాజా పరిణామంతో రాజకుటుంబం మరోసారి చట్టపరమైన చిక్కుల్లో పడింది.






