జిన్ పింగ్ శకం ముగిసినట్లేనా?

by Shamantha N |

బీజింగ్ లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్(72) అదృశ్యం కలకలం రేపుతోంది.

జిన్ పింగ్ శకం ముగిసినట్లేనా?
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజింగ్ లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్(72) అదృశ్యం కలకలం రేపుతోంది. రెండు వారాల నుంచి ఆయన ఆచూకీ తెలియట్లేదు. మే 21-జూన్ 5 తేదీల మధ్య సుమారు 15 రోజులపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ (72) జనానికి కనిపించలేదు. దీంతో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు బయటపడ్డాయి. ఈ పరిణామం చైనా కమ్యూనిస్టు పార్టీలో నాయకత్వ మార్పుకు సంకేతంగా కన్పిస్తోంది. అంతేకాకుండా, ఈ నెల 6, 7 తేదీల్లో బ్రెజిల్ దేశంలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకూ జిన్ పింగ్ హాజరుకాబోవడం లేదు. ఇకపోతే, జిన్ పింగ్ అధికారంలోకి వచ్చాక బ్రిక్స్ శిఖరాగ్రానికి జీ హాజరుకాకపోవడం ఇదే తొలిసారి. ఆయన బదులు చైనా ప్రధాన మంత్రి లీ కియాంగ్ బ్రిక్స్ సదస్సుకు వెళ్లనున్నారు. అయితే, సమస్య మాత్రం జిన్ పింగ్ బీజింగ్ పర్యటన గురించి కాదు.. అసలు చైనాలో జరుగుతోంది ఏంటనేది సందేహం.

సీపీపీ ప్రధాన కార్యదర్శిగా..

మరోవైపు, జిన్ పింగ్ కేవలం దేశాధ్యక్షుడు మాత్రమే కాదు... చైనీస్ కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) ఛైర్మన్. సీఎంసీ తొలి వైస్ ఛైర్మన్ అయిన జనరల్ జాంగ్ యూక్సియా చేతిలో ప్రస్తుతం దేశ పాలనా పగ్గాలు ఉన్నట్టు సమాచారం. కమ్యూనిస్టు పార్టీలో శక్తిమంతమైన 24 మంది సభ్యుల పొలిట్ బ్యూరోలో జాంగ్ సభ్యుడు. దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోకు విశ్వాసపాత్రులైన పార్టీ సీనియర్ సభ్యులు పలువురు జాంగ్ యూక్సియాకు మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, చైనాలో కీలక ఆర్థిక, సైనిక రంగాలపై జీ జిన్ పింగ్ ప్రభావం సన్నగిల్లుతోంది. ఆయన భావజాలపు ముద్ర బలహీనపడుతోంది.

తదుపరి అధ్యక్షుడిగా..

జిన్ పింగ్ రాజకీయ వారసుడిగా టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్ (70) తెరపైకొస్తున్నారు. ఉదారవాదిగా, సంస్కరణకర్తగా వాంగ్ యాంగ్ కు పేరుంది. ఇక జిన్ పింగ్ సన్నిహితులుగా ముద్రపడిన జనరల్స్ పైనా వేటు పడుతోంది. ఇక చైనా ప్రభుత్వం శుక్రవారం ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను వాళ్ల పదవుల నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణల కారణంగా ఈ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సైన్యం తిరుగుబాటుకు భయపడుతున్నారని, అందుకే ఈ చర్య తీసుకున్నట్లు చాలామంది నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు చైనా స్టేట్ కౌన్సిల్‌ 50 మందికి పైగా మంత్రులు, చాలామంది అధికారులు జూన్ 6, 2025న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో కూడా జిన్‌పింగ్ అక్కడ కనిపించలేదు. దీంతో చైనా సైన్యం నుంచి జిన్‌పింగ్‌కు తిరుగుబాటు మొదలైనట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల జిన్ పింగ్ కనిపించకుండా పోయినప్పుడు ఆ సమయంలో చైనా ప్రధాని లీ కెకియాంగ్, ఉప ప్రధాని హీ లిఫెంగ్‌ విదేశీ అధినేతలను కలిశారు. చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, మాజీ రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు వాళ్ల పదవుల నుంచి తొలగించే ముందు కూడా ప్రజల నుంచి కనిపించకుండా పోయారు. ఇదే విధంగా జిన్ పింగ్ ని మెల్లిగా తప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ..

అయితే, జిన్ పింగ్ ఇలా అదృశ్యం కావడం సాధారణమేనని కొన్ని నిఘా సంస్థలు వెల్లడించాయి, మూడేళ్ళ క్రితం 2022లో చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో.. జిన్ పింగ్ పక్కన ఆశీనుడైన దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోను... తాను ‘రాను రానంటున్నా’... సిబ్బంది అమర్యాదకరంగా, బలవంతంగా బయటికి లాక్కెల్లారు. ఈ విజువల్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. అయితే, ఆ చర్యను జిన్ పింగ్ నిలువరించే ప్రయత్నం చేయకపోగా కనీసం అటు వైపు కన్నెత్తి చూడలేదు. హై ప్రొఫైల్ నేతలను ఇలా సాగనంపడం చైనాకు కొత్త కాదు. తమ దేశంలో తలెత్తే అంతర్గత వివాదాల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం విదేశాంగ వ్యవహారాలను ఉపయోగించుకోవడం చైనాకు రివాజే. అంతేకాకుండా, ప్రస్తుత సమయంలో మన దేశం జాగ్రత్తగా ఉండాలనేది నిపుణుల హెచ్చరిస్తున్నారు. భారత్ పై సైబర్ దాడులను చైనా తీవ్రతరం చేయవచ్చని భావిస్తున్నారు.

Next Story