Donald Trump: నోబెల్‌పై ట్రంప్ గంపెడాశలు.. శాంతి పురస్కారం దక్కుతుందా?

by Mahesh Kanagandla |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారంపై గంపెడాశలు పెట్టుకున్నారు. ట్రంప్ అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్ధాలు ఆపినట్టు గొప్పలుపోతున్నారు. ఈ నెల 10న నార్వేజియన్ నోబెల్ కమిటీ శాంతి పురస్కారాన్ని ప్రకటించనుంది.

Donald Trump: నోబెల్‌పై ట్రంప్ గంపెడాశలు.. శాంతి పురస్కారం దక్కుతుందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారంపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఎలాగైనా ఈ సారి నోబెల్ పీస్ ప్రైజ్ దక్కించుకోవాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. తాను శాంతిదూతనని పలుమార్లు ప్రకటించుకున్న ట్రంప్ అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్ధాలు ఆపినట్టు గొప్పలుపోతున్నారు. పాకిస్తాన్, ఇజ్రాయెల్ దేశాధినేతలు ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు కూడా. ఈ నెల 10న నార్వేజియన్ నోబెల్ కమిటీ శాంతి పురస్కారాన్ని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ప్రయత్నాలపై ఆసక్తి పెరుగుతున్నది.

గాజా పురోగతితో చిగురిస్తున్న ఆశలు

ఇజ్రాయెల్- అరబ్ దేశాల మధ్య ఆబ్రహం ఒప్పందం, కాంగో- రువాండ రెబల్స్, థాయిలాండ్-కంబోడియా వంటి ఘర్షణలను ఆయన నిలిపేసినట్టు ట్రంప్ ప్రకటించుకున్నారు. భారత్, పాకిస్తాన్ సీజ్‌ఫైర్ చేయించినట్టూ చెప్పారు. భారత్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూనే ఉన్నది. ఈ ఏడింటికితోడు కొత్తగా గాజా శాంతి ప్రతిపాదన కొంత పురోగతి సాధించింది. హమాస్ ఉగ్రవాదులను ఒప్పందాన్ని అంగీకరించాలని పరుగుపెట్టిస్తున్నారు. టైం వేస్ట్ చేస్తే సహించేదే లేదని ఆయన చేస్తున్న హెచ్చరికలు.. నోబెల్ శాంతి ప్రకటన తేదీని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారా? అనే అనుమానాలకు తావిస్తున్నది. మరోవైపు ట్రంప్ చెబుతున్న ఈ ఘర్షణలు చాలా చిన్నస్థాయివని, కొన్నింటిలో ఆయన పాత్ర పరిమితంగా లేదా శూన్యంగా ఉన్నదనీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు దీర్ఘకాలంగా, తీవ్రంగా జరుగుతున్నాయని, వీటిని ఆపుతానని ప్రకటించిన ట్రంప్ అందులో విఫలమయ్యారని వివరిస్తున్నారు.

అవార్డు కోసం ట్రంప్ లాబీయింగ్

నోబెల్ శాంతి బహుమానం కోసం ట్రంప్ బాహాటంగానే తన ఆసక్తిని ప్రకటించారు. తాను ఎన్నో యుద్ధాలు ఆపారని, తనకే నోబెల్ బహుమతి దక్కాలని చాలా మంది అభిప్రాయపడుతున్నట్టు మొన్న ఐరాసలోనే అనేశారు. యూఎస్ మిలిటరీ అధికారులతో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ నార్వేజియన్ నోబెల్ కమిటీపైనా ఆగ్రహించారు. నోబెల్ పురస్కార ఎంపిక కమిటీ నిర్ణయమే బాగుండదని, ఏమీ చేయని ఓ వ్యక్తిని ఎంపిక చేస్తుంటారని విమర్శించారు. అదే జరిగితే అమెరికాకే అవమానమని పేర్కొన్నారు. అంతేకాదు, తెరవెనుక లాబీయింగ్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. మిడిల్ ఈస్ట్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్, యూఎస్ రక్షణ మంత్రి మార్కో రూబియోలను లాబీయింగ్ కోసం రంగంలోకి దింపారు. యూరప్ దేశాల ప్రతినిధులతో నోబెల్ అంశాన్ని విట్కాఫ్ లేవనెత్తారని, ట్రంప్ స్వయంగా నార్వే ఆర్థిక మంత్రి, నాటో మాజీ సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌(నార్వే రాజకీయ నేత)లతో ఈ విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది. కానీ, నోబెల్ ఎంపికపై చర్చ మరోరకంగా ఉన్నది. శాంతి, సుస్థిరతకోసం కమిట్‌మెంట్‌తో క్షేత్రస్థాయిలో పని చేసే.. లైమ్‌లైట్‌లో లేనివారి కృషిని బహిరంగపరిచేలా నోబెల్ శాంతి బహుమానం ఎంపిక ఉంటుందని, ఆ ప్రయత్న ఫలితాలు దీర్ఘకాలం ప్రభావితం చేసేలా ఉంటాయని, ట్రంప్ వైఖరి ఇందుకు పూర్తిగా భిన్నమని విశ్లేషణలు వస్తున్నాయి. జనవరి 31వ తేదీతో నోబెల్ శాంతి పురస్కారానికి నామినేషన్ల ముగిశాయి. 94 సంస్థలు సహా మొత్తం 338 నామినేషన్లు అందాయి.

Next Story