రెక్కలు వచ్చాక ఎగరడానికి పర్మిషన్ కావాలా..? శశిథరూర్

by Shamantha N |

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు సీరియస్ కావడంతో వివాదం మరింత ముదిరింది.

రెక్కలు వచ్చాక ఎగరడానికి పర్మిషన్ కావాలా..? శశిథరూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు సీరియస్ కావడంతో వివాదం మరింత ముదిరింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ పహల్గాం లో చేసిన దాడి, దాని తర్వాత భారత్ రియాక్షన్, తీవ్ర వాదులను పెంచి పోషిస్తున్న పాక్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం ఎంపీల బృందాలను వివిధ దేశాలకు పంపించింది. ఇందులో రష్యాలోని మాస్కో కు వెళ్లిన బృందంలో శశిథరూర్ ఒకరు. ఆయన సారథ్యంలో మాస్కో లో ఆపరేషన్ సిందూర్ గురించి వివరంగా తెలిపారు. అంతర్జాతీయ వేదికపై ప్రధాన మంత్రి మోడీని పొగుడుతూ శశిథరూర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దౌత్య విధానాల్లో మోడీ అనుసరించిన విధానంపై ప్రశంసల్లో ముంచెత్తారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా శశిథరూర్ పై విరుచుకుపడుతున్నారు.

వివరణ ఇచ్చినా సంతృప్తి పడని నేతలు

తాను బీజేపీని కానీ, మోడీని కానీ వ్యక్తిగతంగా ప్రశంసించలేదని, తనకు బీజేపీలో చేరే ఉద్దేశం లేదని ఇప్పటికే శశిథరూర్ చెప్పారు. అయినా కాంగ్రెస్ లోని వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు శశిథరూర్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. శశిథరూర్ ను తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘మాకు దేశం ముందు అని కొందరికి మోడీ ముందు’ అని శశిథరూర్ ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యస్త్రాలు సంధించారు.ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడనే ఆయనకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని మల్లికార్జున ఖర్గే అనడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా శశి థరూర్ వ్యాఖ్యలు వ్యక్తిగతం అన్నారు. అయితే శశిథరూర్ దేశ ప్రధాని గురించి మాట్లాడితే తప్పేముంది అని కొంతమంది ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు.

మాట్లాడటానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా?

తాజాగా శశిథరూర్ తన ‘ఎక్స్ ’ లో ఓ ఇంట్రస్టింగ్ ఫిక్చర్ పోస్టు చేశారు. రెక్కలు వచ్చాక ఎగరడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఆకాశం ఏ ఒక్కరి సొత్తు కాదు. నీ రెక్కలు నీ ఇష్టం అంటూ ఓ పక్షి ఫొటోను షేర్ చేశారు. ఇది కాంగ్రెస్ సీనియర్ నేతలను ఉద్దేశించి చేసిందే అని అనుకుంటున్నారు. ఏదీ మాట్లాడాలన్న కాంగ్రెస్ అధిష్టానం అనుమతి తీసుకోవాల్సిన పని లేదన్నది ఆ పోస్టు సారాంశమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రతి దానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించి అడగాల్సిన అవసరం లేదని శశిథరూర్ చెప్పాడని అంటున్నారు. రాజకీయాల్లో ఒక్క కాంగ్రెస్సే లేదు వేరే పార్టీలు కూడా ఉన్నాయి. స్వేచ్ఛగా మాట్లాడే పార్టీల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టు చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద శశిథరూర్ చేసిన పోస్టు ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. శశిథరూర్ బీజేపీలో చేరతాడని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తుండగా ఇప్పుడు ‘ఎక్స్’ లో చేసిన పోస్టుకు కాంగ్రెస్ ఎలా రిఫ్లై ఇస్తుందో వేచి చూడాలి.

Next Story