ఉత్కంఠగా కొనసాగుతున్న ఉపఎన్నికల కౌంటింగ్

by Shamantha N |   (  Updated:2025-06-23 05:33:06  IST  )

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగ్గా ఆయా పార్టీలు ముందంజలో ఉన్నాయి

ఉత్కంఠగా కొనసాగుతున్న ఉపఎన్నికల కౌంటింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగ్గా ఆయా పార్టీలు ముందంజలో ఉన్నాయి. కేరళలోని నిలంబూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ముందంజలో ఉండగా, పంజాబ్‌లోని లూధియానా వెస్ట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధిక్యంలో ఉంది. పశ్చిమబెంగాల్‌లోని కలిగంజ్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, గుజరాత్‌లోని కడీ, విసావదార్ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. జూన్ 19న గుజరాత్‌లోని కడీ, విసావదార్, పంజాబ్‌లోని లుధియానా వెస్ట్, బెంగాల్‌లో కలిగంజ్, కేరళలో నిలంబూర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి.పశ్చిమ బెంగాల్, కేరళలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో పాటు INDIA కూటమి ఆత్వవిశ్వాసానికి పరీక్షగా మారనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత నిశ్శబ్దంగా ఉన్న ఆప్ ప్రదర్శనపై గుజరాత్, పంజాబ్‌లో చూపిన స్పందన కీలకంగా మారనుంది.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు

నిలంబూర్ అసెంబ్లీ స్థానంలో 2016లో పోటీ చేసిన ఆర్యాదన్ షౌకత్‌ను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ రంగంలోకి దింపగా, ముందంజలో ఉన్నారు.ఈ నియోజకవర్గం ప్రియాంకా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అందుకే ఆమె ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆమె జూన్ 19 ఉప ఎన్నికలకు ముందు అక్కడ రోడ్ షో నిర్వహించారు.ఈ స్థానం వామపక్ష మద్దతుతో గెలిచిన స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ రాజీనామాతో ఖాళీ అయింది. లుధియానా వెస్ట్‌లో ఆప్ తరఫున పోటీ చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరా ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భారత భూషణ్ అశు రెండవ స్థానంలో, బీజేపీ అభ్యర్థి జీవన్ గుప్తా మూడవ స్థానంలో ఉన్నారు. జనవరిలో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సీ గోగీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ స్థానం ఖాళీ అయింది. ఢిల్లీ పరాజయం తర్వాత పంజాబ్ లో ఉప ఎన్నికల్లో నిలబెట్టుకోవాలని ఆప్ అర్వింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతిషి వంటి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ఆరు సార్లు గెలిచినప్పటికీ, శిరోమణి అకాలీదళ్ (బాదల్) రెండు సార్లు గెలిచింది.విసావదార్, కడీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. విసావదార్‌లో బీజేపీ తరఫున మాజీ జిల్లా అధ్యక్షుడు కిరిత్ పటేల్ పోటీ చేస్తున్నారు. 2007 తర్వాత ఈ స్థానాన్ని బీజేపీ గెలవలేకపోయింది. ఆప్ తరఫున 2015 పాటిదార్ ఆందోళనలో ప్రముఖుడైన గోపాల్ ఇటాలియా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నితిన్ రంపారియా పోటీ చేస్తున్నారు. కడీ స్థానంలో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. మేళసాణా జిల్లాలోని ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్‌. ఫిబ్రవరిలో బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ సోలంకీ మరణంతో ఖాళీ అయింది. బీజేపీ నుంచి రాజేంద్ర చావ్డా, కాంగ్రెస్ నుంచి రమేష్ చావ్డా, ఆప్ నుంచి జగదీశ్ చావ్డా పోటీ చేశారు. నదియా జిల్లాలోని కలిగంజ్ నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి అలిఫా అహ్మద్ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కబీల్ ఉద్దీన్ షైఖ్ రెండో స్థానంలో ఉన్నారు. ఫిబ్రవరిలో తృణమూల్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణంతో ఉప ఎన్నిక అవసరమైంది. బీజేపీ తరఫున ఆశిష్ ఘోష్ పోటీ చేస్తున్నారు. ఎక్కువగా గ్రామీణ జనాభా ఉన్న ఈ ప్రాంతంలో 54 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు.

Next Story