పోప్‌తో వివాదం: ఏఐ చిత్రాన్ని షేర్ చేస్తూ.. తనను తాను ఏసుక్రీస్తుగా వర్ణించుకున్న ట్రంప్

by Ramesh Naini |   (  Updated:2026-04-13 12:05:41  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, క్యాథలిక్ మతగురువు పోప్ లియో XIV మధ్య తీవ్ర స్థాయి మాటల యుద్ధం నడుస్తోంది.

పోప్‌తో వివాదం: ఏఐ చిత్రాన్ని షేర్ చేస్తూ.. తనను తాను ఏసుక్రీస్తుగా వర్ణించుకున్న ట్రంప్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, క్యాథలిక్ మతగురువు పోప్ లియో XIV మధ్య తీవ్ర స్థాయి మాటల యుద్ధం నడుస్తోంది. పోప్‌పై విమర్శలు గుప్పించిన ట్రంప్.. తాజాగా తనను తాను ఏసుక్రీస్తులా చూపుతూ సోషల్ మీడియాలో ఓ ఏఐ (AI) చిత్రాన్ని పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆ చిత్రంలో ట్రంప్ దైవిక కాంతితో మెరిసిపోతూ, దేవదూతల మధ్య ఉండి ఓ వ్యక్తికి స్వస్థత చేకూరుస్తున్నట్లుగా కన్పిస్తోంది.

వివాదానికి కారణమిదే..

ఇరాన్‌లో జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై పోప్ లియో పరోక్ష విమర్శలు చేయడంతో ఈ వివాదం మొదలైందని అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది. ‘యుద్ధాలు చేసేవారి ప్రార్థనలను దేవుడు ఆలకించడు’ అని, వారి తీరు వినాశనానికి దారితీస్తుందని పోప్ వ్యాఖ్యానించారు.

పోప్‌పై ట్రంప్ ఫైర్

పోప్ వ్యాఖ్యలపై మండిపడిన ట్రంప్, ఆయనో ‘బలహీనుడు’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విదేశాంగ విధానంపై పోప్‌కు సరైన అవగాహన లేదని విమర్శించారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని సమర్థించే పోప్ తనకు అక్కర్లేదని స్పష్టం చేశారు. ‘నేను వైట్‌హౌస్‌లో లేకపోతే.. లియో వాటికన్‌లో ఉండేవాడు కాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోప్ వామపక్ష భావజాలాన్ని వీడి, క్యాథలిక్ చర్చిని నడిపించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. వెనిజులా విషయంలోనూ పోప్ అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేశారని ఆరోపించారు. కాగా, ప్రపంచంలోనే అత్యున్నత స్థానాల్లో ఉన్న ఇద్దరు ప్రముఖుల మధ్య ఇలా బహిరంగంగా మాటల యుద్ధం జరగడం, విమర్శలు-ప్రతి విమర్శలు చేసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Next Story