ఒకే కాన్పులో ఐదుగురు బిడ్డలకు జన్మ.. చైనాలో అరుదైన ఘటన

by Ramesh Naini |

చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి దిలి ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది.

ఒకే కాన్పులో ఐదుగురు బిడ్డలకు జన్మ.. చైనాలో అరుదైన ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి దిలి ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది. వైద్య చరిత్రలోనే ఇది అత్యంత విశేషమైన ఘట్టంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. వుహాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో సుమారు 20 మంది వైద్య నిపుణులు, నర్సుల బృందం సమిష్టి కృషితో ఈ క్లిష్టమైన ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రసవంలో నలుగురు ఆడ శిశువులు, ఒక మగ శిశువు క్షేమంగా జన్మించారు. వైద్యుల వివరాల ప్రకారం, సహజ సిద్ధంగా ఒకేసారి ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం సుమారు ఆరు కోట్ల ప్రసవాల్లో ఒక్కసారి మాత్రమే ఉంటుందని తెలిపారు. తమ 40 ఏళ్ల వైద్య సేవా ప్రయాణంలో ఇలాంటి అరుదైన ప్రసవాన్ని చూడటం ఇదే తొలిసారి అని కొందరు సీనియర్ వైద్యులు పేర్కొన్నారు.

ఐదుగురు శిశువుల ఆరోగ్య పరిస్థితి

ప్రస్తుతం పుట్టిన ఐదుగురు శిశువుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారిని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. గర్భధారణ సమయంలో అధిక ప్రమాదాలు ఉండటంతో ముందస్తు ప్రణాళికతో వైద్య బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ ఘటన నెట్టింటా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ చిన్నారులను ప్రేమగా ‘మిరాకిల్ బేబీస్’ అంటూ పిలుస్తున్నారు. సహజ సిద్ధంగా ఐదుగురు శిశువులు జన్మించడం ప్రపంచవ్యాప్తంగా అరుదైన విషయమై ఉండటంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Next Story