పాకిస్తాన్‌లో రెండు డ్యామ్ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేసిన చైనా కాంట్రాక్టర్లు

by Disha Web Desk 17 |
పాకిస్తాన్‌లో రెండు డ్యామ్ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేసిన చైనా కాంట్రాక్టర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లో ఇటీవల డ్యామ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరగడంతో ఐదుగురు చైనీస్ ఇంజనీర్లు, ఒక పాకిస్తానీ డ్రైవర్ మరణించిన నేపథ్యంలో చైనా కాంట్రాక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్‌లోని రెండు ప్రధాన డ్యామ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేసినట్లు ప్రావిన్షియల్ అధికారి తెలిపారు. ఇక్కడి ప్రాజెక్ట్‌లలో దాదాపు 1200 మంది చైనా పౌరులు పనిచేస్తున్నారు. తిరిగి వారు పనిలోకి రావాలంటే పాకిస్తాన్ అధికారులు తమకు మరింత భద్రత అందిచాలని కోరినట్టు ఒక అధికారి తెలిపారు.

ఇటీవల కాలంలో తీవ్రవాదులు తరచుగా చైనీస్ కార్మికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. వారి భద్రత ఇప్పుడు రెండు దేశాలకు పెద్ద సమస్యగా ఉంది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా అంతర్గత విభాగానికి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, చైనా గెజౌబా గ్రూప్ కంపెనీ దాసు డ్యామ్‌పై పనిని నిలిపివేసిందని, అలాగే పవర్ చైనా డైమర్ భాషా డ్యామ్‌పై పనిని నిలిపివేసిందని చెప్పారు. వారు ప్రభుత్వం నుంచి తమకు మరింత రక్షణ కావాలని కోరుకుంటున్నారని అన్నారు.

చైనా తన బెల్ట్ అండ్ రోడ్ పెట్టుబడి పథకంలో భాగంగా పాకిస్తాన్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భారీగా నిధులు అందిస్తూ, నిర్మాణాలు చేపడుతుంది. అయితే ప్రాజెక్టుల ద్వారా సృష్టించిన ఉద్యోగాల్లో తమకు సరైన వాటా లభించడం లేదని పాకిస్థానీలు చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నారు.


Next Story

Most Viewed