- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రాన్స్ మ్యూజియంలో ‘అరటిపండు’ ఆర్ట్ చోరీ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
ప్రముఖ ఇటాలియన్ కళాకారుడు మారిజియో కాటెలాన్ రూపొందించిన అత్యంత వివాదాస్పద, ఖరీదైన కళాఖండం ‘కామెడియన్’ (గోడకు ప్లాస్టర్‌తో అంటించిన అరటిపండు) మరోసారి వార్తల్లోకెక్కింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ఇటాలియన్ కళాకారుడు మారిజియో కాటెలాన్ రూపొందించిన అత్యంత వివాదాస్పద, ఖరీదైన కళాఖండం ‘కామెడియన్’ (గోడకు ప్లాస్టర్‌తో అంటించిన అరటిపండు) మరోసారి వార్తల్లోకెక్కింది. ఫ్రాన్స్‌లోని ‘సెంటర్ పాంపిడౌ-మెట్జ్’ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన ఈ కళాఖండంలోని అరటిపండు చోరీకి గురైంది. అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. గత శనివారం భద్రతా సిబ్బంది ఈ విషయాన్ని గమనించారు. గతంలో ఈ అరటిపండును కొందరు తిన్నప్పుడు మ్యూజియం పెద్దగా స్పందించలేదు. కానీ, ఈసారి దొంగతనం చేసిన వ్యక్తి ఎవరో తెలియకపోవడంతో, కళాఖండాన్ని గౌరవించని వారిపై చర్యలు తీసుకోవాలంటూ మ్యూజియం యాజమాన్యం పోలీసులకు అధికారికంగా క్రిమినల్ ఫిర్యాదు చేసింది.
తక్షణమే ప్రత్యామ్నాయం..
ఈ కళాఖండం నియమ నిబంధనల ప్రకారం, అందులోని అరటిపండు పాడైపోకుండా ఉండేందుకు ప్రతి మూడు రోజులకు ఒకసారి అరటిపండు మారుస్తుంటారు. తాజా చోరీ నేపథ్యంలో, మ్యూజియం సిబ్బంది వెంటనే ఆ స్థానంలో మరొక అరటిపండును అమర్చి ప్రదర్శనను యథావిధిగా కొనసాగించారు. ఈ ఆర్ట్ యొక్క అసలు విలువ అరటిపండులో లేదు, దానిని ప్రదర్శించే విధానం మరియు దానికున్న అధికారిక సర్టిఫికేట్‌లోనే ఉంది.
వివాదాల ‘కామెడియన్’
ఈ అరటిపండు కళాఖండానికి ఒక విచిత్రమైన చరిత్ర ఉంది. 2019లో ఆర్ట్ బాసెల్ ప్రదర్శనలో డేవిడ్ దతునా అనే పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ ఈ అరటిపండును వలిచి తినేశాడు. 2023లో దక్షిణ కొరియాలో ఒక ఆర్ట్ స్టూడెంట్ ఆకలి వేస్తోందంటూ దీనిని తిన్నాడు. 2024లో చైనా క్రిప్టో ప్లాట్‌ఫారమ్ వ్యవస్థాపకుడు జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని వేలంలో ఏకంగా 6.24 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 52 కోట్లు) దక్కించుకుని, ఆ తర్వాత మీడియా ముందే ఆ అరటిపండును తినేశాడు. 2025లో ఇదే ఫ్రాన్స్ మ్యూజియంలో ఒక సందర్శకుడు దీనిని తిన్నప్పటికీ, అప్పట్లో అధికారులు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. కళా ప్రపంచంలో డబ్బు పిచ్చిని, ఊహాజనిత మార్కెట్ విలువలను వ్యంగ్యంగా ప్రశ్నించడమే ఈ ‘కామెడియన్’ ముఖ్య ఉద్దేశమని మ్యూజియం పేర్కొంది. గతంలో కాటెలాన్ రూపొందించిన రూ. 50 కోట్ల విలువైన బంగారు టాయిలెట్ కమోడ్ ‘అమెరికా’ కూడా బ్రిటన్ రాజప్రాసాదం నుంచి చోరీకి గురై, ఇప్పటివరకు దొరకలేదు.






