పాక్ నేవీ ఎయిర్ స్టేషన్‌పై దాడి: తమ పనేనన్న బీఎల్ఏ

by Dishanational2 |
పాక్ నేవీ ఎయిర్ స్టేషన్‌పై దాడి: తమ పనేనన్న బీఎల్ఏ
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లోని టర్భత్ ప్రాంతంలో ఉన్న రెండో అతిపెద్ద నౌకాదశ ఎయిర్ స్టేషన్ పీఎన్ఎస్ సిద్ధిఖ్‌పై సోమవారం అర్ధరాత్రి దాడి జరిగింది. నావల్ ఎయిర్ బేస్‌లోకి ప్రవేశించిన దుండగులు ఎయిర్ స్టేషన్‌పై బాంబులు విసరడంతో పాటు, పలు మార్లు కాల్పులు జరిపినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడులు మూడు గంటలకు పైగా కొనసాగినట్టు తెలిపాయి. ఈ సందర్భంగా పాక్ సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు సైతం జరగగా..నలుగురు ఉగ్రవాదులు మరణించినట్టు సమాచారం. సుమారు ఐదుగురు టెర్రరిస్టులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని.. దాడిలో ఆధునిక ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్‌లు ఉపయోగించారని పాక్ భద్రతా బలగాలు తెలిపాయి. అయితే పాక్ ప్రభుత్వం ఈ దాడిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఓ ప్రకటన విడుదల చేసింది. తమ మిలిటెంట్లు ఎయిర్ బేస్‌లోకి చొరబడి దాడి చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో డజనుకు పైగా పాక్ సిబ్బందిని హత మార్చినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టర్బత్‌లో జిల్లా ఆరోగ్యాధికారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వైద్యులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కాగా, టర్బత్‌లో బీఎల్ఏ దాడి చేయడం ఈ వారంలో ఇది రెండోది. గతంలో మార్చి 20న గ్వాదర్‌లోని మిలిటరీ ఇంటలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పాక్ సైనికులు, ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించారు.

కాగా, దాడికి గల కారణాలు వెల్లడించనప్పటికీ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో చైనా పెట్టుబడులను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలోని వనరులను చైనా, పాకిస్తాన్‌లు దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. గతంలోనూ అనేక దాడులకు పాల్పడగా.. 2022లో ప్రభుత్వం, నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ రద్దు తర్వాత పాకిస్తాన్‌లో ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి.


Next Story

Most Viewed