రఫా నగరంపై మరోసారి ఇజ్రాయెల్ దాడి: 13 మంది పాలస్తీనియన్లు మృతి

by Dishanational2 |
రఫా నగరంపై మరోసారి ఇజ్రాయెల్ దాడి: 13 మంది పాలస్తీనియన్లు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నా ఇజ్రాయెల్ వినిపించుకోవడం లేదు. గాజాపై ప్రతి రోజూ విరుచుకుపడుతునే ఉంది. తాజాగా దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో 13 మంది పాలస్తీనియన్లు మరణించారు. అయితే హమాస్ మీడియా నివేదికలు మాత్రం 15 మందికి పైగా మృతి చెందినట్టు వెల్లడించాయి. రెండు విమానాలతో పలు ఇళ్లపై అటాక్ చేసినట్టు గాజా అధికారులు తెలిపారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డట్టు పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు సంబంధించిన విషయాలను చర్చించడానికి హమాస్ ప్రతినిధులు ఈజిప్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే మిలియన్ల మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్న రఫా నగరంపై ఈ దాడులు జరగడం గమనార్హం. ఘర్షణ తీవ్రతరం కావడంతో హమాస్ ప్రతినిధి బృందం కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చిస్తుందని హమాస్ అధికారులు ప్రకటించారు. దీనికి ఖతర్, ఈజిప్టు మధ్య వర్తిత్వం వహించనున్నట్టు తెలిపాయి. ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి దాడులు జరిగాయి. కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే.

బైడెన్, నెతన్యాహు చర్చలు!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహులు తాజా పరిస్థితిపై ఫోన్ కాల్‌లో చర్చించినట్టు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. రఫా నగరంలో పరిస్థితి, బంధీల విడుదల, గాజాలో మానవతా సాయం వంటి అంశాలపై డిస్కస్ చేసినట్టు పేర్కొంది. తగిన మానవతా ప్రణాళిక లేకుండా రఫా ఆపరేషన్‌కు మద్దతు ఇవ్వలేమని యూఎస్ నెతన్యాహుకు చెప్పినట్టు వెల్లడించింది. ముఖ్యంగా బంధీల విడుదలపైనే ఇద్దరు నేతలు సమీక్షించినట్టు పేర్కొంది. అలాగే గాజాకు మానవతా సాయం అందించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఆటంకం కలిగించొద్దని బైడెన్ నెతన్యాహుకు చెప్పినట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed