ఐఎస్‌ఎస్‌లో మెడికల్‌ ఎమర్జెన్సీ.. ఆగిపోయిన స్పేస్ వాక్.. నాసా సంచలన నిర్ణయం

by Naga Rani Yarlagadda |

అంతరిక్ష పరిశోధనల్లో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కావలసి ఉండగా.. అనుకోకుండా వచ్చిన సమస్యతో అది నిరవధిక వాయిదా పడింది.

ఐఎస్‌ఎస్‌లో మెడికల్‌ ఎమర్జెన్సీ.. ఆగిపోయిన స్పేస్ వాక్.. నాసా సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: అంతరిక్ష పరిశోధనల్లో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కావలసి ఉండగా.. అనుకోకుండా వచ్చిన సమస్యతో అది నిరవధిక వాయిదా పడింది. నాసా వ్యోమగాములు మైక్ ఫిన్కే, జెనా కార్డ్ మ్యాన్ తొలి స్పేస్ వాక్ నిర్వహించే పనులను భుజానికెత్తుకున్నారు. కానీ ఈ స్పేస్ వాక్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు వెళ్లిన నలుగురు ఆస్ట్రోనాట్లలో ఒకరి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అతడిని తిరిగి భూమికి పంపుతున్నట్లు ఐఎస్ఎస్ ప్రకటించింది. దీంతో నాసా ఆ ఆస్ట్రోనాట్ ను భూమికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నలుగురిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఘట్టానికి నాసా స్వస్తి పలకాల్సిన పరిస్థితి వచ్చింది. స్పేస్ వాక్ ను నిరవధిక వాయిదా వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. గత పాతికేళ్లలో చేపట్టిన మిషన్ ఆగిపోవడంతో.. దానిని నాసా నిరవధిక వాయిదా వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఐఎస్ఎస్ కు వెళ్లిన క్రూ-11 ఆస్ట్రోనాట్స్ లో ఒకరి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటంతోపాటు మరొకరికి కూడా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని నాసా తెలిపింది. నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఇసాక్ మాన్, ఇతర ఏజెన్సీ అధికారులు ఐఎస్ఎస్ లో ఉన్న సిబ్బందిని వీలైనంత త్వరగా భూమ్మీదికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 48 గంటల్లోపు దీనిపై అప్డేట్ వస్తుందని పేర్కొన్నారు. అయితే కొన్ని నిబంధనల దృష్ట్యా ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్ల పేర్లను వెల్లడించలేమన్నారు. క్రూ-11లో జెనా కార్డ్ మాన్, మైక్ ఫింకే, జపాన్ కు చెందిన JAXA అంతరిక్ష సంస్థ నుంచి కిమియా యుయి, రష్యాన్ ఆస్ట్రోనాట్ ఒలేగ్ ప్లాటోనోవ్ ఉన్నారు.

నాసా చీఫ్ హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జేమ్స్ పోల్క్ మీడియాతో మాట్లాడుతూ.. నాసా పాతికేళ్ల చరిత్రలో వైద్య సమస్య కారణంగా ఒక మిషన్ ను ముందే ఆపడం, ఐఎస్ఎస్ నుంచి ఒక ఆస్ట్రోనాట్ ను ముందే భూమ్మీదికి తీసుకురావడం ఇదే మొదటిసారి అన్నారు.

Next Story