- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ కలకలం.. మరో హిందువుపై దాడి.. చికిత్స పొందుతూ మృతి
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సునామ్‌గంజ్ జిల్లాలో జై మహాపాత్ర (జాయ్ మహాపాత్రో) అనే యువకుడిపై దుండగులు దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సునామ్‌గంజ్ జిల్లాలో జై మహాపాత్ర (జాయ్ మహాపాత్రో) అనే యువకుడిపై దుండగులు దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సునామ్‌గంజ్ జిల్లాలోని భంగడోహర్ గ్రామానికి చెందిన జై మహాపాత్రను గురువారం ఓ స్థానిక షాపునకు పిలిపించి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని సిల్హెట్ ఎంఏజీ ఉస్మానీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ దాడి ముందే పథకం ప్రకారం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి అనంతరం అమీరుల్ ఇస్లాం అనే వ్యక్తి విషం ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది.
35 రోజుల్లో 11 మంది హిందువుల హత్యలు?
బంగ్లాదేశ్‌లో గత కొన్ని వారాలుగా హిందువులపై హింస తీవ్రరూపం దాల్చుతోంది. గత 35 రోజుల్లో 11 మంది హిందువులు హత్యకు గురైనట్లు సమాచారం. రాడికల్ యాంటీ ఇండియా నేత షరీఫ్ ఒస్మాన్ హాది మరణానంతరం ఈ దాడులు మరింత పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మైమెన్సింగ్ జిల్లాలో 27 ఏళ్ల దీపు చంద్ర దాస్ కొట్టిచంపబడగా, డిసెంబరు 24న రాజ్‌బరీ జిల్లాలో అమృత్ మండల్‌ను గుంపు దాడి చేసి హతమార్చింది. ఆ తర్వాత మైమెన్సింగ్‌లో బజేంద్ర బిస్వాస్ కాల్చి చంపబడ్డాడు. షరియత్‌పూర్ జిల్లాలో ఖోకన్ దాస్‌ను తగలబెట్టి చంపగా, జనవరి 5న జెస్సోర్‌లో జర్నలిస్టు రణ ప్రతాప్ బైరాగి కాల్పుల్లో మృతి చెందాడు. మరుసటి రోజే నర్సింగ్డీ జిల్లాలో శరత్ మణి చక్రవర్తి హత్యకు గురయ్యాడు.
భారత్ ఖండన..
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, ‘మైనారిటీలపై పదే పదే జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలను వ్యక్తిగత వైరం లేదా రాజకీయ కారణాలుగా చూపించే ప్రయత్నాలు కూడా కలవరపెడుతున్నాయి’ అని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై అంతర్జాతీయంగా ఆందోళన పెరుగుతున్న వేళ, తాజా ఘటన మరోసారి కలకలం రేపుతోంది.






