కర్ణాటకలో ‘అమూల్’ వివాదం..

by Shamantha N |

కర్ణాటకలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) గుజరాత్‌కు చెందిన అమూల్ కంపెనీ మధ్య కుదిరిన లైసెన్స్ ఒప్పందం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.

కర్ణాటకలో ‘అమూల్’ వివాదం..
X

దిశ, నేషనల్ బ్యూరో:కర్ణాటకలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) గుజరాత్‌కు చెందిన అమూల్ కంపెనీ మధ్య కుదిరిన లైసెన్స్ ఒప్పందం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. జూన్ 16న విడుదలైన BMRCL లెటర్ ప్రకారం, బెంగళూరులోని పది ప్రధాన మెట్రో స్టేషన్లలో అమూల్ కియోస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్లలో కెంపేగౌడ మెట్రో (మ్యాజెస్టిక్), ఇందిరానగర్, బయ్యప్పనహళ్లి, ట్రినిటీ, బనశంకరి వంటి ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి. అమూల్‌ను నిర్వహిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF)తో ఈ ఒప్పందం కుదిరింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండించిన జెడీఎస్ నేత కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, కాంగ్రెస్ ప్రభుత్వం కన్నడ స్వాభిమానాన్ని తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ‘అమూల్‌కు ప్రాధాన్యత ఇచ్చి నందినిని పక్కన పెట్టడం కన్నడ గౌరవాన్ని అమ్ముకున్నట్టే’ అంటూ ఆయన ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ (Save Nandini) సేవ్ నందిని నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని సాగించి, నందిని బ్రాండ్‌ను రైతుల భవిష్యత్తు రాష్ట్ర గౌరవంగా చిత్రీకరించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అమూల్‌కు మెట్రో కియోస్క్‌ల అనుమతి ఇవ్వడంపై తీవ్రంగా మండిపడింది.

స్పందించిన డీకే శివకుమార్

ఈ వివాదంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, BMRCL గ్లోబల్ టెండర్‌ను ఆహ్వానించిందని, అందులో అమూల్ మాత్రమే దరఖాస్తు చేసుకున్నందున పారదర్శకంగా జరిగిన ప్రక్రియలో ఒప్పందాన్ని రద్దు చేయలేమన్నారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF)కి చెందిన నందినికీ ఎనిమిది మెట్రో స్టేషన్లలో అవుట్‌లెట్లు ఏర్పాటు చేసేందుకు మేము అనుమతి ఇస్తామని వెల్లడించారు. 2023లో అమూల్ బెంగళూరులో ఆన్‌లైన్ డెలివరీలు ప్రారంభిస్తామంటూ చేసిన ట్వీట్‌కి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజా వ్యతిరేకత వ్యక్తమైంది. నందినిని అణచివేసే కుట్రగా ప్రజలు భావించారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ జెడీఎస్ పార్టీలు అమూల్ ప్రవేశాన్ని బీజేపీ మద్దతుతో జరుగుతున్న కుట్రగా వర్ణించి, KMF బ్రాండ్‌కు ముప్పుగా పేర్కొన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అమూల్‌కు మార్గం సుగమం చేయడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Next Story