2026లో మూడో ప్రపంచ యుద్ధం, ఆర్థికమాంద్యం, ఇంకా ఎన్నో విపత్తులు.. వైరల్ అవుతున్న బాబా వంగా భవిష్యవాణి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-31 00:41:04  IST  )

నూతన సంవత్సరం వస్తుందంటే.. బాబా వంగా భవిష్యవాణిలో ఆ ఏడాది గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు.

2026లో మూడో ప్రపంచ యుద్ధం, ఆర్థికమాంద్యం, ఇంకా ఎన్నో విపత్తులు.. వైరల్ అవుతున్న బాబా వంగా భవిష్యవాణి
X

దిశ, వెబ్‌డెస్క్: 2026 నూతన సంవత్సర వేడుకలకు ప్రపంచమంత సిద్ధమవుతుండగా.. సోషల్ మీడియాలో బాబా వంగా చెప్పిన భవిష్యవాణి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాల్కన్స్ నోస్ట్రాడమస్ అని పిలువబడే బాబా వంగా 2026 కొత్త సంవత్సరానికి సంబంధించిన అంచనాలపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పుట్టుకతోనే అంధురాలైన బల్గేరియన్ మహిళ బాబా వంగా చెప్పిన భవిష్యవాణిపై ప్రపంచంలో చాలా మందికి బలమైన నమ్మకం ఉంది. 9/11 దాడుల నుంచి.. అమెరికాలో ఒబామా అధికారం చేపట్టం వరకూ, కోవిడ్ 19 సహా ప్రపంచ ప్రధాన సంఘటనలను ముందుగానే ఊహించారు. ప్రతీదీ చాలా కాలం క్రితమే బాబా వంగా ఊహించి చెప్పారని చెబుతారు. అయితే 2026కు సంబంధించి ఆమె చెప్పిన విషయాలు ఆందోళనకు గురిచేసేవిగా ఉన్నాయి.

బాబా వంగా జోస్యం ప్రకారం.. ప్రపంచంలోని తూర్పు భాగంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ యుద్ధం జ్వాలలు పాశ్చాత్య దేశాలకు చేరుకుని గణనీయమైన నష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా అమెరికా, రష్యా , చైనా వంటి ప్రధాన శక్తులతో కూడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వివాదం ప్రపంచ శక్తి సమతుల్యతను పూర్తిగా మార్చేదిగా ఉంటుంది. ఆ సమయంలో రష్యన్ నాయకుడు దానిని నియంత్రించగలడు.

అలాగే 2026లో ప్రపంచం కొన్ని తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవచ్చని వంగా భవిష్యవాణి చెబుతోంది. వంగ సూచనల ప్రకారం.. పర్యావరణ సంక్షోభాలు, వాతావరణ మార్పులు, భారీ వర్షాలు కారణంగా వరదలు, కరువులు సంభవిస్తాయి. అగ్నిపర్వతాల విస్ఫోటనాలు పెరుగుతాయి. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు.. వరదలు, కార్చిచ్చులు, దుర్బల ప్రాంతాల్లో భూకంపాలకు దారి తీస్తాయని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేశారు.

ఏఐ డామినేషన్

ఇప్పటికే ఏఐ..హ్యూమన్ ను డామినేట్ చేస్తోంది. మున్ముందు ఇది మానవులకు అందని నిర్ణయాలను తీసుకుని, దైనందిన కార్యకలాపాలను కూడా ప్రభావితం చేస్తుందని, ఈ పరిస్థితి మనుషులు నిర్వహించలేని విధంగా ఉంటుందని, ఇది భవిష్యత్తుకు ముఖ్యమైన సవాలుగా మారుతుందని బాబా వంగా భవిష్యవాణిలో చెప్పారు. చైనా వంటి దేశం 2026లో బలపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. తైవాన్, సౌత్ చైనా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటాయి. రష్యాలో కొత్త నాయకుడు అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అతనికి యుద్ధం, రాజకీయ గందరగోళం కారణంగా గణనీయమైన గుర్తింపు లభించనుందని బాబా వంగా ఊహించారు. అంతేకాదు తీవ్రమైన ఆర్థిక మాంద్యం వస్తుందని ముందే ఊహించినట్లు తెలుస్తోంది.

గ్రహాంతర జీవులతో పరిచయం?

2026లో గ్రహాంతర జీవులతో తొలి పరిచయం ఏర్పడవచ్చని అంచనాలున్నాయి. మానవాళి గ్రహాంతర జీవులను ఎదుర్కోవచ్చని, ఖగోళ శాస్త్రవేత్తలు జూలై 2025 లో చిలీలోని ATLAS టెలిస్కోప్ ద్వారా కనుగొనబడిన ఒక నక్షత్రాంతర వస్తువు 3I/ATLAS ను గుర్తించిన తర్వాత ఈ సిద్ధాంతం ప్రజాదరణ పొందింది. 3I/ATLAS..హైపర్బోలిక్ పథాన్ని అనుసరిస్తుంది, ఇది మన సౌర వ్యవస్థ వెలుపల ఉద్భవించిందని నిర్ధారిస్తుంది. శాస్త్రవేత్తలు దీనిని కృత్రిమంగా కాకుండా సహజ ఇంటర్స్టెల్లార్ వస్తువుగా కూడా వర్గీకరించారు.

Next Story