58 రోజుల తర్వాత.. టెహ్రాన్ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సేవల పునరుద్ధరణ

by Ramesh Naini |

అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన వాణిజ్య విమానాల రాకపోకలు టెహ్రాన్ విమానాశ్రయంలో శనివారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి.

58 రోజుల తర్వాత.. టెహ్రాన్ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సేవల పునరుద్ధరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన వాణిజ్య విమానాల రాకపోకలు టెహ్రాన్ విమానాశ్రయంలో శనివారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. దాదాపు 58 రోజుల విరామం తర్వాత ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు పునరుద్ధరించబడటంతో ప్రయాణికులకు ఊరట లభించినట్లైంది.

మెరాజ్ ఎయిర్‌లైన్స్ సేవలు

ఇరాన్‌కు చెందిన మెరాజ్ ఎయిర్‌లైన్స్.. టెహ్రాన్-నజఫ్-మష్హాద్ మార్గంలో ఏప్రిల్ 27, 29 తేదీల్లో రెండు సర్వీసులను పునరుద్ధరించినట్లు నజఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెల్లడించింది. రాబోయే రోజుల్లో విమానాల సంఖ్యను పెంచేందుకు, మరిన్ని మార్గాలను విస్తరించేందుకు ఎయిర్‌లైన్స్‌తో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది.

పాక్షికంగా గగనతలం ఓపెన్

సాంకేతిక సంసిద్ధత ఆధారంగా దేశంలోని గగనతలం, పలు విమానాశ్రయాలను పాక్షికంగా తెరిచినట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ ఏప్రిల్ 24నే ప్రకటించింది. టెహ్రాన్ విమానాశ్రయం తెరుచుకున్నప్పటికీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇంకా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ప్రముఖ సంస్థ లుఫ్తాన్సా అక్టోబర్ 24 వరకు, సలామ్ ఎయిర్ ఏప్రిల్ 30 వరకు టెహ్రాన్ సర్వీసులను రద్దు చేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇతర విమానయాన సంస్థలు కూడా ఇరాన్ గగనతలాన్ని తప్పించుకుంటూ ప్రత్యామ్నాయ సుదీర్ఘ మార్గాల్లోనే రాకపోకలు సాగిస్తున్నాయి. మొత్తం మీద, యుద్ధ భయాల తర్వాత ఇరాన్ విమానయాన రంగం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Next Story