చైనాలో సంచలనం! రోబోను అరెస్ట్ చేసిన పోలీసులు? తర్వాత ఏమైందంటే?

by Ramesh Naini |

చైనాలోని మకావులో చోటుచేసుకున్న ఒక వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక రోబో రోడ్డుపై వెళ్తున్న వృద్ధురాలిని భయపెట్టడంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆ రోబోను 'అరెస్ట్' చేసి స్టేషన్‌కు తరలించారు.

చైనాలో సంచలనం! రోబోను అరెస్ట్ చేసిన పోలీసులు? తర్వాత ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ పెరిగే కొద్దీ వింతలు కూడా పెరుగుతున్నాయి. చైనాలోని మకావు నగరంలో ఒక హ్యూమనాయిడ్ రోబో ఒక 70 ఏళ్ల వృద్ధురాలిని ఇబ్బంది పెట్టింది. దీంతో పోలీసులు ఆ రోబోను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వీడియో వైరల్ అవుతోంది. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. గత గురువారం సాయంత్రం పాటేన్ ప్రాంతంలోని లోక్ యుంగ్ ఫా యుయెన్ నివాస సముదాయం వద్ద ఒక వృద్ధురాలు తన ఫోన్ చూసుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో యూనిట్రీ G1 (Unitree G1) అనే హ్యూమనాయిడ్ రోబో హఠాత్తుగా ఆమె వెనుక వచ్చి నిలబడింది. ఫోన్ చూసుకుని వెనక్కి తిరిగిన ఆ వృద్ధురాలు, తన వెంటే ఉన్న రోబోను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

నా గుండె ఆగిపోయేలా చేశావు!

భయంతో వణికిపోయిన ఆమె రోబోపై ఫైర్ అయింది. ‘నా గుండె ఆగిపోయేలా చేశావు! నువ్వు ఎన్నో పనులు చేయగలవు కానీ, ఇలాంటి గందరగోళం సృష్టించడమేనా నీకు తెలుసు? నీకేమైనా పిచ్చా?’ అంటూ కంటోనీస్ భాషలో గట్టిగా అరిచింది. ఈ గొడవ చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఇద్దరు పోలీసులు ఆ రోబోను అరెస్ట్ చేసినట్లుగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. భయాందోళనకు గురైన వృద్ధురాలిని ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని నిర్ధారించుకున్నాక డిశ్చార్జ్ చేశారు.

ప్రచారం కోసం ఉపయోగించే రోబో..

అయితే, ఒక స్థానిక విద్యా కేంద్రం ఈ రోబోను టెస్టింగ్ చేస్తోందని తెలిసింది. ఆ కేంద్ర ప్రతినిధి టోవిన్ మాక్ వివరణ ఇస్తూ.. రోబో ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న సమయంలో సదరు వృద్ధురాలు దారికి అడ్డంగా ఉందని, ఆమె పక్కకు తప్పుకునే వరకు రోబో ఆమె వెనుక నిలబడి వేచి చూసిందని తెలిపారు. అయితే, ఆ రోబో ఆకారం చూసి ఆమె భయపడిందని పేర్కొన్నారు. పోలీసులు రోబో యజమానిని (50 ఏళ్ల వ్యక్తి) పిలిపించి, బహిరంగ ప్రదేశాల్లో రోబోలను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి రోబోను తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. రోబోను పోలీసులు పట్టుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. కాగా, యూనిట్రీ G1 రోబో 4 అడుగుల ఎత్తు ఉండే ఒక కమర్షియల్ రోబో. ఇది అడ్డంకులను గుర్తించే సెన్సార్లు, డెప్త్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీనిని ప్రధానంగా విద్య, ప్రచార కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారని నిపుణులు తెలిపారు.

Next Story