35 రోజుల్లో 11 మంది హిందువుల హత్య.. ఎన్నికల వేళ బంగ్లాలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు

by Naga Rani Yarlagadda |

బంగ్లాదేశ్ లో వరుసగా జరుగుతున్న హిందువుల హత్యలను చూస్తుంటే.. అక్కడి శాంతిభద్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయని క్లియర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మాత్రం ఇవి మతపరమైన హత్యలు కావని కొట్టిపారేస్తోంది.

35 రోజుల్లో 11 మంది హిందువుల హత్య.. ఎన్నికల వేళ బంగ్లాలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగ్లాదేశ్ లో వరుసగా జరుగుతున్న హిందువుల హత్యలను చూస్తుంటే.. అక్కడి శాంతిభద్రతలు క్రమంగా క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మాత్రం ఇవి మతపరమైన హత్యలు కావని, పరస్పర వాదనల కారణంగా జరిగిన హత్యలని తేలికగా తీసిపారేస్తోంది. కానీ.. 35 రోజుల్లో 11 మంది హిందువులను అక్కడి ఇస్లామిక్ శక్తులు హత్య చేసిన ధోరణులను దీర్ఘంగా పరిశీలిస్తే.. వేరే కథను చెబుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా హింస చెలరేగేలా చేసి.. హిందువులను టార్గెట్ చేస్తున్నారనేందుకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. షేక్ హసీనా పాలన పతనం తర్వాత.. బంగ్లాలో హిందువులు, వారి ప్రార్థనా స్థలాలు, హిందువుల వ్యాపారాలపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ (BHBCUC) వంటి సంస్థలు ఈ దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన దీపు హత్య

డిసెంబర్ 18న మైమెన్ సింగ్ జిల్లాలో గార్మెంట్ ఫ్యాక్టరీ వర్కర్ దీపు చంద్రదాస్ ను ఇస్లామిక్ మూకలు కొట్టి చంపి, అతని మృతదేహాన్ని చెట్టుకు వేలాడదాసి తగలబెట్టిన ఘటన.. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అతనేం తప్పు చేశాడని అంత కఠినంగా చంపేశారంటూ సోషల్ మీడియాలో ఆందోళనలు వెల్లువెత్తాయి. దీపుచంద్రదాస్ ను బంగ్లా పోలీసులే ఇస్లామిస్ట్ మూకలు అప్పజెప్పిన వీడియో కూడా బయటికి రావడంతో బంగ్లాలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్న ఆందోళన మరింత ఎక్కువైంది. దీపు చంద్రదాస్ హత్య తర్వాత జెస్సోర్ జిల్లాలో హిందూ వార్తాపత్రిక ఎడిటర్ రాణా కాంతి బైరాగి, కిరాణ వ్యాపారి మణి చక్రవర్తి ఈ ఏడాది జనవరి 5న హత్యలకు గురయ్యారు. అలా ఇప్పటి వరకూ 11 మంది హిందువులు హత్యకు గురికాగా.. వారిలో 1971 విముక్తి యుద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు ముక్తిజోద్ధ, అతని భార్య కూడా ఉండటం మరింత కలచివేసింది. డిసెంబర్ 7న జోగేష్ చంద్రబాయ్, సుబోర్ణారాయ్ లను వారింట్లోనే గొంతుకోసి హతమార్చారారు. ఈ హత్యలకంటే ముందు డిసెంబర్ 2న బంగారం వ్యాపారి చేసే హిందువు ప్రంతోష్ కోర్మోకర్ ను రాయ్ పురా ఉపజిల్లాలో కాల్చి చంపారు. వ్యాపార చర్చల నెపంతో అతన్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి సమీపంలోని స్కూల్ గ్రౌండ్ కు తీసుకెళ్లి హతమార్చారు. అదే రోజున ఫరీద్ పూర్ జిల్లాలో చేపల వ్యాపారి ఉత్పోల్ సర్కార్ కూడా దారుణ హత్యకు గురయ్యాడు. మార్కెట్ కు వెళ్తుండగా దుండగులు అడ్డుకుని, కళ్లకు గంతలుకట్టి నరికి చంపారు. డిసెంబర్ 12న శాంతో చంద్రదాస్ అనే ఆటోరిక్షా డ్రైవర్ ను గొంతుకోసి చంపి.. మొక్కజొన్న పొలంలో పడేశారు. డిసెంబర్ 24న అమృత్ మండల్, 29న బజేంద్ర బిశ్వాస్, జనవరి 3న ఖోకోన్ చంద్రదాస్, జనవరి 5న రాణా కాంతి బైరాగి, మణి చక్రవర్తి హత్యలకు గురయ్యారు.

ఎందుకు హిందువులను టార్గెట్ చేశారు?

2024 ఆగస్టు5న షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసిన తర్వాత.. రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఎక్స్ ట్రీమిజం పెరిగింది. హసీనా హయాంలో హిందువులకు రక్షణ ఉండేది. అక్కడ చాలా మంది హిందువులు అవామీ లీగ్ మద్దతుదారులని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ లో రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు బలపడ్డాయి. 2025 డిసెంబర్ లో ఇస్లామిస్ట్ నేత షరీఫ్ ఒస్మాన్ హదీ మరణం తర్వాత.. అక్కడ హిందువులపై దాడులు పెరిగాయి. హదీ మరణానికి, హసీనాకు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యాంటీ ఇండియా, యాంటీ హిందూ భావనలు పెరిగిపోయాయి. ఇండియన్ మిషన్లు, వీసా సెంటర్లపై దాడులు జరిగాయి. దీపు చంద్రదాస్ హత్యకు కూడా యాంటీ హిందూ భావనే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అతను పనిచేస్తున్న కంపెనీలో యాంటీ ఇస్లామిస్ట్ వ్యాఖ్యలు చేయడంతో క్రూరంగా కొట్టిచంపేసినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం దొంగతనం, బిజినెస్ గొడవలు, పర్సనల్ శత్రుత్వాల వల్ల హత్యలు జరుగుతున్నట్లు చెప్తోంది. కానీ అంతర్జాతీయ సంస్థలు మాత్రం బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కొద్దిరోజుల్లోనే బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్న వేళ అక్కడి శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల హత్యలపై అక్కడి దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తాయా లేక అవి మతపరంగా జరిగిన హత్యలు కాదని తీసిపారేస్తాయా? అని సందిగ్ధత నెలకొంది.

Next Story