‘వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సంక్లిష్టం’

by  |
‘వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సంక్లిష్టం’
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును ఇచ్చాయి. ఈ విధానంపై దిగ్గజ కంపెనీల నుంచి ఇప్పటివరకు సానుకూల అభిప్రాయాలే వినిపించాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సంస్థల వ్యయం తగ్గుతుందని, ఉద్యోగుల నుంచి పనితీరు మెరుగ్గా కనిపిస్తోందని చెప్పారు. అయితే, మొదటిసారిగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎన్నో లాభాలున్నప్పటికీ, దీనివల్ల అనేక సంక్లిష్టతలున్నాయి.

ఆన్‌లైన్ సమావేశాల వల్ల ఉద్యోగులు అలసిపోయే అవకాశాలున్నాయని, ముఖ్యంగా పని వాతావరణం నుంచి వ్యక్తిగత జీవితంలోకి మారేందుకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఆఫీసుల్లో ఉండే ప్రయోజనాలను కోల్పోతామని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా సత్య నాదెళ్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ విధానంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్ సమావేశాలు జరగడానికి ముందు తర్వాత పనులను చక్కబెట్టుకోవాల్సి రావడం కష్టంగా ఉంటుందన్నారు.

ఆఫీసు పని, వ్యక్తిగత కార్యకలాపాల మధ్య సమన్వయం ఎలా చేసుకోవాలో కరోనా సంక్షోభం నేర్పిందన్నారు. అయితే, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆఫీసు నుంచి దూరంగా పనిచేసేందుకు కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారిని సంస్థలోకి ఆహ్వానించాలని, శిక్షణ, నైపుణ్యాలను మెరుగు పరచడం కీలక అంశాలను గుర్తించాలన్నారు.

అదే సమయంలో సోషల్ మీడియా సంస్థలు ట్విటర్, ఫేస్‌బుక్‌లు ఇంటర్‌నెట్ భద్రతపై దృష్టి సారించాలని, ఇంటర్‌నెట్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాబట్టి రానున్న రోజుల్లో కీలక సంస్కరణలు చేపట్టాలని, మైక్రోసాఫ్ట్ తన ఎక్స్‌బాక్స్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంటెంట్ సంబంధిత అంశాలను పరిష్కరించడం అనుభవం సాధించినట్టు వెల్లడించారు.



Next Story