దారుణం: ఆడపడుచు నవ్విందని.. రెండు నెలల చిన్నారిని చంపేసిందట..

by  |
దారుణం: ఆడపడుచు నవ్విందని.. రెండు నెలల చిన్నారిని చంపేసిందట..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు తగ్గిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు.. ప్రేమలు, ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. భార్యాభర్తలు, తండ్రీకొడుకులు, వదినా ఆడబిడ్డ లాంటి బంధాలు విద్వేషాలుగా మారుతున్నాయి. తాజాగా ఆడపడుచు నవ్విందన్న కోపంతో రెండు నెలల పసిబిడ్డ అని కూడా చూడకుండా అతికిరాతకంగా చంపిందో కిరాతకురాలు. ఆడపడుచు బిడ్డకోసం ఏడుస్తుంటే తనివితీరా నవ్వుకొంది.. కానీ, చివరాఖరికి జైల్లో కటకటాలు లెక్కపెడుతోంది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం..

అనాజ్ పూర్ కు చెందిన లతకు ఇబ్రహీంపట్నం దగ్గర్లోని నెర్రపల్లికి చెందిన తిరుమలేష్ తో పెళ్లైంది. వివాహమైన పన్నెండేళ్ల తర్వాత వారికి రెండు నెలలక్రితం బాబు పుట్టాడు. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. అయితే లత తమ్ముడు భార్య శ్వేతకు థైరాయిడ్ కారణంగా ఇటీవలే అబార్షన్ అయ్యింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఉంటున్న లత పలుమార్లు శ్వేతను అబార్షన్ నెపంతో అవమానిస్తూ, హేళనగా మాట్లాడింది. ఆడబిడ్డ మాటలతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్వేత పిల్లలు పుట్టకపోతే కలిగే బాధను లతకు తెలిసేలా చేయాలని దుర్మార్గంగా ఆలోచించింది.

తన బాధ ఆడపడుచు కూడా పడాలనుకొని లత బిడ్డను చంపాలని ప్లాన్ వేసింది. శుక్రవారం అందరు నిద్రిస్తున్న సమయంలో లత పక్కలో ఉన్న పసిబిడ్డను ఎత్తుకొని ఇంటిపైకి వెళ్ళింది. అక్కడ బాలుడి ముక్కు.. ఛాతీ మీద అదిమి హత్య చేసే ప్రయత్నం చేసింది. అదే సమయంలో బాబు నిద్ర లేచి ఏడుపు మొదలుపెట్టడంతో కంగారు పడిన శ్వేత బాలుడ్ని పక్కనే ఉన్న నీటి ట్యాంకులో వేసి ఐదు నిమిషాల తర్వాత పిల్లాడు చనిపోయాడని నిర్దారించిన తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇంట్లోకి వెళ్లి తనకేమీ తెలీదన్నట్లుగా నిద్ర పోయింది.

ఉదయం లేచి చూసేసరికి బిడ్డ కనిపించకపోయేసరికి కంగారుపడిన లత అన్నిచోట్లా వెతికి పోలిస్లకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి శవాన్ని వాటర్ ట్యాంక్ లో కనిపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణచేపట్టారు. ఇంట్లోకి కొత్తవారెవరూ రాకపోవడంతో కుటుంబసభ్యులను విచారించారు. ఈ క్రమంలో శ్వేతను అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా మొదట తనకేమి తెలియదని డ్రామాలు ఆడింది. అనంతరం తమదైన రీతిలో విచారించగా హత్య చేసినట్లు అంకరించడంతో పోలీసులు శ్వేతను అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed