విత్‌ఔట్ ప్రిస్కిప్షన్.. మెడిసిన్ డెలివరీ!

by  |
విత్‌ఔట్ ప్రిస్కిప్షన్.. మెడిసిన్ డెలివరీ!
X

మీకు జ్వరం వస్తోందా..? కడుపు నొప్పి.. ఒళ్లు నొప్పులు భరించలేకుండా ఉన్నారా..? నిద్ర పట్టడం లేదా..? ఏం భయం లేదు. డాక్టర్లను కలవాల్సిన అవసరమే లేదు. ప్రిస్కిప్షన్ లేకపోయినా పర్వాలేదు. విషయం చెబితే చాలు.. మెడికల్‌ షాపుల్లో అన్ని రకాల మందులు ఇచ్చేస్తారు. ఏ మందులు వేసుకోవాలో.. రోజుకు ఎన్ని వేసుకోవాలో కూడా వారే చెప్పేస్తారు. జిల్లా వ్యాప్తంగా మెడికల్‌ దుకాణాల నిర్వహకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు తనిఖీలు చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేయడం.. చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది.

దిశ ప్రతినిధి, మేడ్చల్ : వైద్యులు ప్రిస్కిప్షన్‌ రాసిస్తేనే మెడికల్‌ షాపుల్లో ఔషధాలు ఇవ్వాలి. ఈ నిబంధనలను చాలా దుకాణదారులు పాటించడం లేదు. రోగి, బంధుమిత్రులు వచ్చి మందులు కావాలంటే ప్రిస్కిప్షన్‌ లేకున్నా ఇచ్చేస్తున్నారు. కార్డియాలజీ, సైక్రియాట్రి, న్యూరాలజీ, బ్రెయిన్‌ స్ట్రోక్‌, డయాబెటిక్‌, బీపీ, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ తదితర మందులను డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా ఇవ్వకూడదు. ఇందులో హైడోస్‌, లోడోస్‌ ఉంటాయి. రోగ తీవ్రత, రోగి వయసును బట్టి డాక్టర్లు డోసులను నిర్ణయిస్తారు. ప్రిస్కిప్షన్‌ పై డాక్టర్‌ ఎన్ని మందులు రాశారో ఆ మేరకే ఇవ్వాలి. రోగి మరోసారి అడిగితే ఇవ్వకూడదు. కానీ నిబంధనలు అమలు కావడం లేదు.

ఎన్ని కావాలన్నా..

మెడికల్‌ షాప్‌కి వెళ్లి అడిగితే.. ఏ మందులు ఎన్ని కావాలన్నా ఇచ్చేస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారు కొన్ని రకాల సిరప్‌లను వాడుతున్నారు. కోరెక్స్‌, పెన్సిడ్రిల్‌ వంటి ఔషధాలు కొంత మత్తు కలిగిస్తాయి. మాదకద్రవ్యాలు దొరకని సమయంలో వాటికి బానిసైనవారు ఈ సిరప్‌లను వినియోగిస్తుంటారు. ఈ తరహా సిరప్‌లను డాక్టర్‌ రాసి ఇస్తేనే రోగికి ఇవ్వాలి. కానీ కొన్ని మెడికల్‌ షాపుల్లో ఎవరెన్ని అడిగినా ఇచ్చేస్తున్నారు. నిషేధిత డ్రగ్స్‌, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. డాక్టర్‌ రాసిన ఔషధాలు లేకుంటే, వాటికి బదులుగా మరో కంపెనీ మందులను అంటగడుతున్నారు.

ఫార్మాసిస్టులు లేకుండానే..

మేడ్చల్ జిల్లాలో రిటైల్‌, హోల్‌సేల్‌ మెడికల్‌ షాపులు మొత్తం 1,678 వరకు ఉన్నాయి. రోజు చిన్న, పెద్ద దుకాణాల్లో రూ.3వేల నుంచి రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంటుంది. ఇలా ప్రతి రోజు రూ.3కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ యాక్ట్‌ 1940 ప్రకారం ప్రతి మెడికల్‌ షాపులో రిజిస్టర్డ్‌ ఫార్మసిస్ట్‌ ఉండాలి. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డీ ఫార్మసీ చేసిన వారు (రిజిస్టర్‌ చేసుకుని ఉండాలి) మాత్రమే మెడికల్‌ దుకాణాలను నిర్వహించాలి. ఇవన్నీ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పరిశీలించాలి. అయితే మామూళ్ల మత్తులో కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల లెక్కలు, డ్రగ్‌ ఇన్ స్పెక్టర్ల నివేదికల ప్రకారం ప్రతి మెడికల్‌ షాపు ఫార్మసిస్టు పర్యవేక్షణలో నడుస్తుంటుంది. వాస్తవంగా లైసెన్సు మాత్రమే ఫార్మసిస్టు పేరిట ఉంటుంది. దుకాణాలను ఔషధాలపై కాస్త అవగాహన ఉన్న సిబ్బంది నిర్వహిస్తుంటారు. వీరికి తక్కువ వేతనం ఇచ్చి దోపిడీ చేస్తున్నారు.

ప్రిస్కిప్షన్‌ లేకుండా ఇవ్వొద్దు..

డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వొద్దు. ప్రిస్కిప్షన్‌లో సూచించిన మేరకు మందులు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే వైద్యుల అనుమతి తీసుకోవాలి. మందులను ఇచ్చిన వెంటనే దానికి సంబంధించి బిల్లు ఇవ్వాలి. మాదకద్రవ్యాల తరహా సిరప్‌లపై నిఘా పెట్టాం. ఐదుగురు డ్రగ్స్‌ ఇన్ స్పెక్టర్లు నిరంతరం పర్యక్షిస్తున్నారు. ప్రతి సోమవారం ఒక్కో ఏరియాలో జాయింట్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా విక్రయిస్తూ పట్టుబడితే చర్యలు తీసుకుంటాం.

– అనిల్ కుమార్, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ


Next Story

Most Viewed