వారెవ్వా.. వైన్ పెయింటింగ్స్

by  |
వారెవ్వా.. వైన్ పెయింటింగ్స్
X

దిశ, ఫీచర్స్ : వైన్ తాగితే కిక్కొస్తుందని తెలుసు కానీ.. వైన్‌తో వావ్ అనిపించే బొమ్మలు కూడా వేయొచ్చని సెర్బియన్‌కు చెందిన యువ కళాకారిణి సంజా జాంకోవిక్ నిరూపిస్తోంది. జీవం ఉట్టిపడేలా ఆమె వేసిన పెయింటింగ్స్ ఎంతలా ఆకర్షిస్తున్నాయంటే.. ‘నీ చిత్రం చూసి.. మా చిత్తం చెదిరి, మేం చిత్తరువైతిమయ్యో’ అని ఆమె అభిమానులు పాడుకోకుండా ఉండలేరేమో. కాగా తను ఆయిల్ పెయింట్, వాటర్ కలర్స్ లేదా యాక్రిలిక్స్‌కు బదులుగా రెడ్, వైట్, రోస్ వివిధ రకాల వైన్‌లను ఉపయోగించి ఈ కళాకృతులను సృష్టిస్తుండటం విశేషం.

సంజా జాంకోవిక్‌కు పెయింటిగ్స్‌లో ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టం. అందుకే అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించుకుని అద్భుతమైన కళాకృతులను తీర్చిదిద్దేది. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో ‘వైన్’తో పెయింటింగ్ ట్రై చేసింది. ఆ ఆర్ట్ వర్క్ చూసి తనే ఆశ్చర్యపోగా.. వైన్‌తో పెయింటింగ్ వేయడం కొంత ప్రత్యేకతను అందిస్తుందని నమ్మింది. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురైనా ఓ చాలెంజింగ్‌గా తీసుకుని మరీ ఆర్ట్ వర్క్‌ను కొనసాగించింది. ప్రస్తుతం రెడ్, వైట్, రోస్, పింక్, పర్పుల్ రంగులతోనే తనువేసే చిత్రాలను అట్రాక్టివ్‌గా మలుస్తుండగా.. ‘వైన్‌రెల్’ అనే కళారూపం మాత్రం చాలా ప్రత్యేకమైందని చెబుతోంది. ఆరేళ్లుగా వైన్ ఆర్ట్‌లో ప్రయోగాలు చేస్తున్నన సంజా.. ఈ క్రమంలో తన అభిమాన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ పాత్రలను కాన్వాస్‌పై ఎంతో అద్భుతంగా మలిచింది. మోనాలిసా, మర్లిన్ మన్రో చిత్రాలతో పాటు జంతువులు, ప్రకృతి రమణీయ దృశ్యాలను కూడా తన పెయింటింగ్స్‌లో ఆవిష్కరించింది.

‘ఈ అందమైన పెయింటింగ్స్ విభిన్నమైనవి, చమత్కారమైనవి. పెయింటింగ్స్‌లో ఉపయోగించిన వర్ణాల కారణంగా కాకుండా కిణ్వ ప్రక్రియ, ఆక్సీకరణ వల్ల ఈ కళాకృతులకు మరింత అందం చేకూరింది. ఈ రంగులు సహజంగా మనకు లభించవు. మొదట్లో స్వదేశీతో పాటు ఇంపోర్టెడ్ వరకు, మెర్లోట్ నుంచి రోన్ రైస్‌లింగ్ వరకు అన్ని రకాల వైన్లను ఉపయోగించాను. అయితే ఎక్స్‌పీరియన్స్ వచ్చిన కొద్దీ వేర్వేరు వైన్స్ వల్ల వైట్ కాన్వాస్‌తో విభిన్నంగా ఇంటారాక్ట్ కావడాన్ని గమనించి పెయింటింగ్ నాణ్యతను స్థిరంగా ఉంచడానికి, కావలసిన టోన్లలో ఆ రంగులు స్థిరపడ్డానికి స్పెసిఫైడ్ వైన్స్‌ను వాడుతున్నాను. వైన్ లాగా, ఈ పెయింటింగ్స్ సజీవంగా ఉన్నట్లు మెచ్యూర్ చెందుతాయి’ అని సంజా చెబుతోంది.


Next Story

Most Viewed