పొంగులేటికి ‘బెర్త్’ ఖాయమేనా?

by  |
పొంగులేటికి ‘బెర్త్’ ఖాయమేనా?
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : మాజీ ఎంపీ పొంగులేటికి మహర్దశ పట్టనుందా..? ఎన్నాళ్ల నుంచో ఆశిస్తున్న ‘పదవి’ దక్కనుందా..? ఎన్నోసార్లు హామీ ఇచ్చి తప్పిన టీఆర్ఎస్ అధిష్టానం ఈ సారి దాన్ని నెరవేర్చబోతుందా..? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. త్వరలో సీఎంగా కేటీఆర్ కు పట్టాభిషేకం చేయనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడున్న కేబినెట్లో మార్పులు జరగొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ సీఎం అయితే ఖమ్మం మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డికి కూడా ఆయన మంత్రి వర్గంలో చోటు దక్కొచ్చనే చర్చ జోరుగా జరుగుతోంది.

అందుకేనా ‘పదవి’ మాట

ఇటీవల మంత్రి కేటీఆర్ ఖమ్మం వచ్చినప్పుడే శ్రీనివాసరెడ్డికి ‘స్పష్టమైన’ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. పదవి మాట అటుంచితే ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపాయి. పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు పునరాలోచనలో పడుతుందని అందరూ భావించారు. కానీ అలాంటిదేం జరగనట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో కేటీఆర్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం జరిగింది. సమావేశంలో ఎవరినీ తక్కువ చేసి చూడొద్దంటూ ఉమ్మడి ఖమ్మం నేతలకు కేటీఆర్ క్లాస్ తీసుకున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పొంగులేటి, తుమ్మలతో వేర్వేరుగా కేటీఆర్ భేటీ

ఉమ్మడి జిల్లా నేతలతో గురువారం జరిగిన మీటింగ్ అనంతరం కేటీఆర్ పొంగులేటితో దాదాపు 2గంటల పాటు ఏకాంతంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. పొంగులేటి అనుచరులైన పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావుతో పాటు మిగతా వారి భవిష్యత్తుకూ యువనేత పూర్తి హామీ ఇచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రి తుమ్మలతోనూ కేటీఆర్ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఆయనకు కూడా రాష్ట్రస్థాయిలో పదవి లభించే అవకాశాలున్నాయని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు.

ఎవరూ దూరం కావద్దనే

పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరినీ దూరం చేసుకోవద్దనే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా జిల్లాలోని కొందరు నేతలకు అభయం ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు కారణాలతో ఖమ్మం నేతల్లో పెరిగిన అంతరం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని భావించిన కేటీఆర్ మొదటి నుంచీ ఆ దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో అందరినీ హైదరాబాద్ పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఏదిఏమైనా ఈసారైనా నేతలంతా కలిసి నడుస్తారో చూడాలి మరి.

ఇదిలా ఉండగా, కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు కూడా కేసీఆర్‌కు తమ అభిప్రాయం తెలిపినట్లు సమాచారం. యువనేత సీఎం అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed