ఒక వేళ కిమ్ చనిపోతే.. ఉత్తరకొరియాను ఏలేది ఎవరు..?

by  |
ఒక వేళ కిమ్ చనిపోతే.. ఉత్తరకొరియాను ఏలేది ఎవరు..?
X

చైనాకు ఈశాన్య దిశగా.. చైనాలోనే ఒక ప్రావిన్స్ అనిపించేలా ఉంటుంది ఉత్తర కొరియా. భౌగోళికంగా చైనాతో కలసి పోయి ఉన్నా సరే ఉత్తర కొరియా ఒక నిగూఢ దేశం. ఉత్తర కొరియాలో అంతర్గతంగా ఏం జరుగుతుందో ప్రపంచానికి.. అంతెందుకు కొరియా వాసులకే తెలియదు. ఒక వేళ అనుమానాలున్నా నోరు తెరిచి అడిగే స్వేచ్ఛ వారికి లేదు. ప్రపంచంలోనే అత్యంత నిర్బంధ జీవితం గడుపుతున్న వాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లు ఉత్తరకొరియా వాసులే. ఉత్తర కొరియాకు, దక్షిణ కొరియాకు రాజకీయ, ఆర్థిక విషయాల్లో అసలు పోలికే ఉండదు. ఉత్తర కొరియాకు కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షుడు అనే పేరేగాని అతడు నియంతతో సమానం. అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన అతడిని దారిలోకి తెచ్చుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు చేతులెత్తేయల్సి వచ్చింది.

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే ఉత్తరకొరియా నుంచి ఒక సంచలన వార్త ప్రపంచానికి తెలిసింది. నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య ఉన్నాడనేది ఆ వార్త సారాంశం. ఇటీవల జరిగిన శస్త్ర చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమంగా మారిందని అంటున్నారు. కొన్ని నిఘా ఏజెన్సీలైతే అతడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని.. కొరియా టాప్ లీడర్లు ఆ విషయాన్ని బయటకు పొక్కనీయడం లేదని అంటున్నారు. ఒక వేళ కిమ్ చనిపోతే మరి ఆ దేశాన్ని ఏలేది ఎవరు..? కిమ్ కంటే పవర్‌ఫుల్ వ్యక్తి ఆ దేశంలో ఉన్నారా..? ఉంటే ఎవరు అని అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అందరి చూపూ ఒక వ్యక్తిపై పడింది. ఆమెనే కిమ్ యో జోంగ్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌కు స్వయానా చెల్లెలు. ఒక స్త్రీ అణ్వస్త్ర దేశాన్ని పాలించగలదా..? కిమ్ లాంటి నియంతకు వారసురాలిగా యో ఏమేరకు పరిపాలన సాగించగలదని అనుకుంటుంటే ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. కిమ్ యో అన్నయ్య కిమ్ ఉన్‌తో కలసి స్విట్జర్లాండ్‌లో చదువుకున్నారు. అన్నయ్య కిమ్‌కంటే ఆమె ఐదేండ్లు చిన్నది. వాళ్ల నాన్న కిమ్ జోంగ్ ఇల్ 2008లో చనిపోయిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్ష పీఠం ఎక్కాడు. ఆనాడు ప్రమాణ స్వీకారం రోజున అన్ని ఏర్పాట్లను చేసింది కిమ్ యో అని చెబుతారు. అంతే కాదు కిమ్ అధ్యక్షుడు అయిన నాటి నుంచి అతని వెన్నంటే ఉంటూ.. ప్రతీ విషయంలో సలహాలు, సూచనలు చేసిన వ్యక్తి యో. కిమ్ యో యొక్క పరిపాలన దక్షత, ఆమె సలహాల్లోని చురుకుదనం చూసి కిమ్ ఉన్ తన చెల్లికి పార్టీలో సముచిత స్థానం కట్టబెట్టాడు. 2010లో తొలి సారిగా ఆమె పార్టీ సమావేశంలో పాల్గొంది. ఆనాటి నుంచి పార్టీపై ఆమె పట్టును పెంచుకుంది. అంతేకాదు ఉత్తర కొరియా-అమెరికా చర్చల్లో కీలక సభ్యురాలుగా కిమ్ యో వ్యవహరించింది. ఇక చిరకాల ప్రత్యర్థి దక్షిణ కొరియాపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.

ప్రస్తుతం ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్‌కు నమ్మిన బంటు ఎవరైనా ఉన్నారా అంటే అందరూ కిమ్ జోంగ్ యో పేరే చెబుతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి సమయంలో అయినా అన్న కిమ్‌ను కలుసుకునే స్వేచ్చ ఒక్క ఈ చెల్లెలికే ఉంది. రాబోయే రోజుల్లో ఉత్తర కొరియాకు ఆమే అధ్యక్షురాలు అవుతుందని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం కిమ్ కుటుంబంలో రాజకీయంగా యాక్టీవ్‌గా ఎవరూ లేరు. గతంలో ఉన్నా సరే వారిని కిమ్ ఎప్పుడో అణగదొక్కేశాడు. ఇక కిమ్ యో జోంగ్ ఒక్కరే మిగలడంతో ఉత్తర కొరియాకు కాబోయే అధ్యక్షురాలు ఆమేనని అందరూ చెప్పుకుంటున్నారు.

Tags: north korea, next supreme leader, kim jong un, serious conditions

Next Story

Most Viewed