మా భవిష్యత్ ఏంటి.?

by  |
మా భవిష్యత్ ఏంటి.?
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది వీఆర్వోల్లో అసంతృప్తి కనిపిస్తోంది. కష్టపడి సాధించుకున్న ఉద్యోగాల్లో తాము నేడు సంతృప్తిగా పని చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఫలానా పని అంటూ ప్రత్యేకంగా ప్రభుత్వం కేటాయించకుండా రోజుకో పని అప్పగించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అవకతవకలు, అవినీతి కారణంగా చూపుతూ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీఆర్వోలకు ఏ విధులు అప్పగిస్తారనే ప్రశ్న మొదలైంది. ప్రభుత్వం వీరిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని చెప్పింది. కానీ ఇంత వరకు వీరికి ఫలానా పని అంటూ ఏమీ కేటాయించలేదు. రోజుకోపని చెబుతుండటంతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉద్యోగం సంతృప్తిగా చేయలేవకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాప్తంగా 760 మంది చాలా కాలం వీఆర్వోలుగా సేవలందించారు. వారిని ఉన్న పలంగా ప్రభుత్వం తప్పించింది. రిలీవ్ చేసిన వారిని త్వరలోనే ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 2 నెలలు కావస్తున్నా వీరిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజూ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రావడం తప్ప చేసేదేమి లేకపోవడంతో అసలు తమ పరిస్థితి ఏంటన్న ప్రశ్న వారిలో మెదులుతోంది. తమను ఏ శాఖలో విలీనం చేస్తారు? ఎక్కడికి పంపిస్తారు? తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని వారిలో ఆందోళన మొదలైంది.

ఏ శాఖలోకి పంపిస్తారు?

చాలా కాలం పాటు రెవెన్యూ శాఖలో సేవలందించిన తమను ఏ శాఖలోకి పంపిస్తారనే ప్రశ్న మెదులుతోంది. ఇతర శాఖల్లోకి పంపడం వల్ల అక్కడ కుదురుకోవడానికి కొంత సమయం తప్పేలా లేదని అభిప్రాయపడుతున్నారు. ఈనెల 29న సీఎం కేసీఆర్ ‘ధరణి’ని ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమను ధరణిలో ఏదైన పనులకు వాడుకుంటారా.? లేదా.? ఇతర శాఖల్లో విలీనం చేస్తారా.? అనే విషయంపై స్పష్టత కరువైంది. చాలా వరకు వీఆర్వోలు మాత్రం ఇతర శాఖల్లో విలీనం చేయడం కారణంగా తమకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పరిస్థితులను, పని విధానం.. ప్రస్తుతం తాము చేసిన పనికి పూర్తిగా భిన్నంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు.

సీనియార్టీ‌పై ప్రభావం

వీరి సీనియార్టీని కొనసాగిస్తూ వేరే శాఖలో విలీనం చేస్తే ఆ శాఖలో పని చేసే సిబ్బంది సీనియార్టీ దెబ్బతినే అవకాశముంది. తమను ఏ ఇతర శాఖల్లో విలీనం చేసినా సీనియార్టీ అలాగే కొనసాగిస్తారా? లేక నష్టపరుస్తారా? అనే ఆందోళన వీఆర్వోల్లో మొదలైంది. ఒక వేళ తమ సీనియార్టీ దెబ్బతింటే తమకు సరైన సమయంలో ప్రమోషన్లు దక్కవని, తమ ఎదుగుదల అగిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

ఇబ్బందులు

సెప్టెంబర్ 7న ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి వీఆర్వోల వద్ద నుంచి రికార్డులను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీఆర్వోలకు ఎలాంటి నిర్దిష్టమైన పని కేటాయించలేదు. స్థానిక తహసీల్దార్లు వారికి తోచిన పనులను అప్పగించి వారి సేవలను వినియోగించుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు హరిత వనాల పనులు చూసిన వీఆర్వోలు, తరువాత ప్రభుత్వం చేపట్టిన ఆన్‌లైన్ సర్వే పనుల్లో పంచాయతీ కార్యదర్శులకు సహకరించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియకు పరిశీలిస్తున్నారు. ఇలా రోజుకో పని చెప్పడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ విషయంలో ప్రభుత్వం త్వరగా ఏదో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed