డార్క్ ఎనర్జీ.. సైంటిస్టులకు అంతుచిక్కిందా?

228

దిశ, ఫీచర్స్:అధునాతన సాంకేతికతతో విశ్వంలోని అనేక విషయాలపై పట్టుసాధిస్తున్న శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. 20వ శతాబ్దం చివరన ఆశ్చర్యకరంగా వెల్లడైన వాటిలో విశ్వం వేగంగా పెరుగుతుందనేది ఒకటి. కాగా యూనివర్స్‌లో 68%గా ఆవరించి మిస్టీరియస్ ఫామ్‌గా ఉన్న ‘డార్క్ ఎనర్జీ’.. దశాబ్దాల నుంచి భౌతిక శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. సైన్స్‌ హిస్టరీలోనూ ‘అత్యంత లోతైన రహస్యం’గా గుర్తించబడింది.

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, సరికొత్త ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు మొదటిసారి ‘డార్క్ ఎనర్జీ’ గురించిన విలువైన సమాచారాన్ని కనుగొన్నారు. భూగర్భ ప్రయోగంలో కొన్ని ఊహించని ఫలితాలను గమనించిన సైంటిస్టులు దానికి ఈ చీకటి శక్తి(డార్క్ ఎనర్జీ) కారణమని భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన కృష్ణ పదార్థం(డార్క్ మ్యాటర్) ఎక్స్‌పరిమెంట్ XENON1T.. ఇటలీలోని INFN లాబొరేటరీ నాజియోనాలి డెల్ గ్రాన్ సాసోలో భూగర్భ లోతుల్లో నిర్వహించబడింది. కాగా కృష్ణ పదార్థాన్ని గుర్తించడానికి రూపొందించబడిన XENON1T వంటి ప్రయోగాలు ‘చీకటి శక్తి’ని గుర్తించడానికి కూడా ఉపయోగపడతాయని కనుగొన్నారు.

డార్క్ ఎనర్జీ Vs డార్క్ మ్యాటర్..

‘మనం చూసే గ్రహాలు, చంద్రుడు, భారీ గెలాక్సీలు, మనుషులు అన్నీ కలిపినా సరే విశ్వంలో 5% కంటే తక్కువే కాగా.. దాదాపు 27% డార్క్ మ్యాటర్, 68% డార్క్ ఎనర్జీతోనే నిండి ఉంటుంది. ఇక డార్క్ మ్యాటర్‌కు గెలాక్సీలను ఆకర్షించే స్వభావం ఉండగా.. వికర్షించే స్వభావం గల ‘డార్క్ ఎనర్జీ’నే విశ్వం విస్తరణకు కారణమవుతోంది. ఈ ‘రెండు భాగాలు అదృశ్య శక్తులుగా ఉన్నప్పటికీ, 1920లోనే సూచించబడిన ‘కృష్ణ పదార్థం’ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో ఉంది. కాగా 1998 వరకు డార్క్ ఎనర్జీ కనుగొనబడలేదు’ అని కేంబ్రిడ్జ్ కావ్లి ఇనిస్టిట్యూట్ ఫర్ కాస్మోలజీకి చెందిన సైంటిస్ట్ సన్నీ వాగ్నోజీ తెలిపారు. ఇక XENON1T వంటి పెద్దస్థాయి ప్రయోగాలు కృష్ణ పదార్థాన్ని నేరుగా గుర్తించడానికి రూపొందించబడ్డాయి. కానీ డార్క్ ఎనర్జీని స్పష్టంగా కనుగొనలేకపోయాయి.

ఎలా గుర్తించబడ్డాయి?

‘గతేడాది ‘XENON1T’ ప్రయోగం ఊహించని సంకేతాన్ని నివేదించింది. ఇవి ఒక్కోసారి ప్రాథమిక ఆవిష్కరణలకు కూడా దారితీయవచ్చని ఇటలీలోని ఫ్రాస్కాటి నేషనల్ లేబొరేటరీస్‌కు చెందిన సహ రచయిత లూకా విసినెల్లి అన్నారు. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం XENON1Tలోని ఎలక్ట్రాన్లు సగటున డార్క్ మ్యాటర్ లేదా డార్క్ ఎనర్జీ లేకపోయినా ‘కిక్స్’ కారణంగా స్వల్పంగా స్వయంచాలకంగా కదులుతాయని డాక్టర్ వాగ్నోజీ వివరించారు. ~2 keV చుట్టూ ఉన్న శక్తుల వద్ద కేవలం శబ్ధం కారణంగా ఒకరు ఊహించిన దాని కంటే ఎక్కువ సంఘటనలు ఉన్నాయని, ఇది చీకటి శక్తి వల్లనే కావచ్చు’ అని వెల్లడించారు. అయితే దీనిపై కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలకు సందేహాలున్నాయి. అది నిజమా? కాదా? అని ధృవీకరించడానికి ఇంకా చాలా ప్రయోగాలు జరగాల్సి ఉంది.

ఒకవేళ సిగ్నల్ వేరే శక్తి వల్ల కలిగితే?

సూర్యుని బలమైన అయస్కాంత క్షేత్రాల్లో ఉత్పత్తి చేయబడిన ‘డార్క్ ఎనర్జీ’ కణాలు ‘XENON1T’లో కనిపించే సిగ్నల్‌ను వివరించగలవని చూపించడానికి పరిశోధకుల బృందం ‘చమేలియన్ స్క్రీనింగ్’ అని పిలువబడే స్క్రీనింగ్ మెకానిజంను ఉపయోగించి భౌతిక నమూనాను నిర్మించింది. మన విశ్వంలో నాలుగు ప్రాథమిక శక్తులు ఉండగా.. ఊహాజనిత సిద్ధాంతాలు ఐదవ శక్తిని ప్రతిపాదించాయి. అయితే ఇది ఆ నాలుగు శక్తుల ద్వారా వివరించబడదు. ఈ ఐదవ శక్తిని దాచడానికి లేదా తెరవడానికి, డార్క్ ఎనర్జీ కోసం అనేక నమూనాల స్పెషల్ మెకానిజంను ఉపయోగిస్తారు.

డా. వాగ్నోజీ ‘డార్క్ ఎనర్జీ’ని వెతకడానికి కొత్త మార్గాల గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. XENON1T ప్రయోగానికి రాబోయే అప్‌గ్రేడ్‌లు, LUX-Zeplin వంటి ప్రయోగాలు-శాన్ఫోర్డ్ భూగర్భ పరిశోధన సౌకర్యం వద్ద ఉన్న నెక్ట్స్ తరం కృష్ణ పదార్థ ప్రయోగం, పాండా X-xT-చైనా జిన్‌పింగ్ భూగర్భ ప్రయోగశాలలోని మరొక ప్రాజెక్ట్.. రాబోయే దశాబ్దంలో నేరుగా చీకటి శక్తిని గుర్తించడంలో సాయపడగలవని పరిశోధకుల బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.