- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటితో ముగిసిన నైరుతి రుతు పవనాలు.. రాష్ట్రంలో 33 శాతం అధిక వర్షపాతం నమోదు
రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు నేటితో ముగిశాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు నేటితో ముగిశాయి. హైదరాబాద్ చరిత్రలో ఈ సంవత్సరం వర్షపాతం రికార్డులు సృష్టించింది. ఒక దశాబ్ద కాలంలోనే ఇది అత్యధిక వర్షపాతం అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జీహెచ్‌ఎంసీ (జీహెచ్ఎంసీ) పరిధిలో సగటున ఏకంగా 897 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 43.7 శాతం అధికం కావడం గమనార్హం. ఈ భారీ వర్షపాతంలో అధికంగా అంటే 867 మి.మీ. వర్షపాతం జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే కురిసింది. గత 20 ఏళ్లలో ఇంతటి వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రప్రథమం. ముఖ్యంగా, హైదరాబాద్‌లో వరుసగా ఆరవ సంవత్సరం కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి.
తెలంగాణలోనూ అత్యధిక వర్షపాతం
రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరుసగా 6వ సంవత్సరం అధిక వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 988.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది రాష్ట్ర సగటు వర్ష పాతం కంటే 33 శాతం ఎక్కువగా ఉంది. జూన్ నెలలో వానలు అంతగా లేకపోయినా, ఆ తర్వాత పుంజుకుని జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు ఈ రికార్డులకు కారణమయ్యాయి. ఈ సంవత్సరం నైరుతి రుతు పవనాలు రాష్ట్రానికి బిగ్ రిలీఫ్‌ను, భారీ నీటి వనరులను అందించాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
కేవలం 3 మండలాల్లోనే లోటు..
ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో (జూన్ 1 నుంచి సెప్టెంబర్ చివరి వరకు) రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం విశేషం. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం మండలాల్లో కేవలం మూడు మండలాల్లో మాత్రమే లోటు వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాలన్నిటికీ వర్షాలు సమృద్ధిగా అందాయి. ముఖ్యంగా, 137 మండలాల్లో అతి భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే 60 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదవడం ఈ సీజన్ యొక్క ప్రత్యేకత. అలాగే సాధారణ వర్షపాతం 188 మండలాల్లో, అధిక వర్షాపాతం 293 మండలాల్లో నమోదైంది. ఈ భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు జలాశయాల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ఈ సమృద్ధిగా కురిసిన వర్షాలు వ్యవసాయానికి, భూగర్భ జలాల పునరుద్ధరణకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
33 శాతం అధిక వర్షపాతం..
ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్ ముగిసింది. సీజన్ మొత్తంలో సాధారణం కంటే గణనీయంగా అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తం మీద 33 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. అయితే, వర్షాకాలం ఆరంభంలో కొంత ఆందోళన కలిగించినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా, జూన్ నెలలో 20 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో రైతాంగంలో నిరాశ నెలకొంది. కానీ, జులై నెల నుంచి వర్షాలు పుంజుకోవడం మొదలుపెట్టాయి. జులైలో కేవలం 2 శాతం లోటు మాత్రమే ఉండటం, ఆ తర్వాత మరింత అధిక వర్షపాతం నమోదై లోటును భర్తీ చేసింది. మొత్తం సీజన్ ముగిసేసరికి, సగటున పది శాతం అధికంగా వర్షాలు నమోదైనట్లు ప్రాథమిక అంచనా. అయితే, తుది లెక్కల ప్రకారం ఇది 33 శాతం అధికంగా నమోదైనట్లు ప్రకటించారు. ఈ అంచనాను బట్టి, మొత్తం మీద వర్షాల సీజన్ సంతృప్తికరంగా ముగిసిందని చెప్పవచ్చు.
దేశంలో సాధారణం కంటే ఎక్కువ..
ఈ ఏడాది అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా నెలవారీ వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 1971 నుండి 2020 వరకు గల డేటా ఆధారంగా, అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) వర్షపాతం సుమారు 75.4 మిల్లీమీటర్లుగా ఉంది. అక్టోబర్ నెలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అక్టోబర్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం నుండి తక్కువగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు..
అక్టోబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువగాను లేదా సాధారణం లేదా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
7 జిల్లాల్లో అత్యధికం..
రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాల సీజన్ ముగిసిన నేపథ్యంలో వాతావరణ శాఖ జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నమోదైన వర్షాపాతం వివరాలను వెల్లడించింది. ఆయా గణాంకాల ప్రకారం లోటు వర్షాపాతం ఉన్న మండలాలు మహదేవ్ పూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ నార్త్ మండలాల్లో లోటు వర్షపాతం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధిక వర్షాపాతం కామారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో నమోదైంది. అలాగే సాధారణ వర్షాపాతం 10 జిల్లాల్లో నమోదైంది. మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.






