ఏపీలో నిప్పుల కొలిమిలా ఎండలు.. కడపలో 45.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్‌లో భానుడు సెగలు కక్కుతున్నాడు. ఈ క్రమంలోనే కడపలో రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలో నిప్పుల కొలిమిలా ఎండలు.. కడపలో 45.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ (April) నెలలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా కడప (Kadapa) జిల్లాలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలు, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఇక్కడ సగటున 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు డీ హైడ్రైషన్‌కు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

తెలంగాణలోనూ ఠారెత్తిస్తున్న ఎండలు..

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఇక్కడ మెండోరా మండలంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది.

Next Story