Heavy Rains:తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-14 02:40:19  IST  )

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇవాళ(గురువారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది

Heavy Rains:తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు(గురువారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత మూడు రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగి నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇవాళ(గురువారం) పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణ(Telangana))లోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, యాద్రాద్రి, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు సూర్యాపేట, మేడ్చల్‌ జిల్లాలలో అతి భారీ వర్షాల దృష్ట్యా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి, సూర్యాపేట, మేడ్చల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీచేసింది. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా.

ఏపీ(Andhra Pradesh)లో నేడు అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే.. ఏపీలోని బాపట్లలో నిన్న(బుధవారం) అత్యధిక వర్షపాతం నమోదైంది. చుండూరు మండలంలో 27.24 సెం.మీ వర్షం కురిసింది. గుంటూరు జిల్లా చేబ్రోలులో 23.4, దుగ్గరాలలో 22.58, తాడికొండలో 22.50, మంగళగిరిలో 19.48, నాగాయలంకలో 19.1, పెదకాకానిలో 18.68, తుళ్లూరులో 18.02, తెనాలిలో 17.84, కోనసీమ జిల్లా డి.ముమ్మిడివరంలో 18.8, ఏలూరు జిల్లా నిడమర్రులో 14.3, నందిగామలో 13.3, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 11.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Next Story