Heat Waves: దేశవ్యాప్తంగా వడగాడ్పుల మంట.. ఆ రాష్ట్రాలకు హెచ్చరికలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-25 03:57:23  IST  )

దేశవ్యాప్తంగా రోజు రోజుకి ఎండలు మండుతున్నాయి.

Heat Waves: దేశవ్యాప్తంగా వడగాడ్పుల మంట.. ఆ రాష్ట్రాలకు హెచ్చరికలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా రోజు రోజుకి ఎండలు (Summer) మండుతున్నాయి. దీనికి తోడు రానున్న రెండు రోజుల పాటు పలు రాష్ట్రాల్లో వడగాలులు వీయనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో ప్రమాద (Yellow alert) హెచ్చరికలు జారీ చేసింది. వడగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వివరించింది. అయితే, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపుర్, మేఘాలయ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అలాగే, దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ఎదురుగాలు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

ఇక తెలంగాణలోనూ రోబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్‌, కుమురం భీం, నిజామాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించింది. మరో 21 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం మరింత ఎక్కువగా ఉండనుందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే వీలుందని పేర్కొంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వడదెబ్బల కారణంగా మరణాల ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరింత జాగ్రత్త ఉండాలని తెలిపారు.

సమృద్ధిగా వర్షాలు

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది. 1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, ఇప్పుడు అందులో 105% దాకా వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ ఏడాదిలో ఎల్‌నినో ఏర్పడే పరిస్థితులు లేవని వివరించింది. డిసెంబరు-మార్చి మధ్య హిమాలయాలు, యూరో ఏసియా ప్రాంతంలో మంచు తక్కువగా ఉందని, ఇవన్నీ మంచి వర్షాలు కురవడానికి శుభపరిణామాలని IMD పేర్కొంది.

Next Story