మండే ఎండలకు ఇక బ్రేక్.. 2 రోజుల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు

by Kema Shiva Kumar |

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

మండే ఎండలకు ఇక బ్రేక్.. 2 రోజుల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు (Monsoons) రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని, అవి ఇప్పటికే లక్షద్వీప్‌కు చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోనుందని, రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు..

రుతుపవనాల ప్రవేశంతో వచ్చే 3 రోజులు తెలంగాణలోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. ప్రజలు వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.

ఓ వైపు రుతుపవనాలు ముంచుకొస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ వడగాలుల (Heatwave) హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఆయా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. రుతుపవనాలు వచ్చే లోపు ఎండల తీవ్రత, ఉక్కపోత గరిష్ఠ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నందున... ప్రజలు అత్యవసరమైతేనే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

Next Story