మరియమ్మ లాకప్‌డెత్‌ కేసును మేమే విచారిస్తాం

by  |
Mariamma lockup death case
X

దిశ, తెలంగాణ బ్యూరో : పోలీసు లాకప్‌లో దళిత మహిళ మరియమ్మ మృతి చెందిన వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. సీబీఐ దర్యాప్తుకు అప్పగించడంపై ఆ విభాగం ఎస్పీ అభిప్రాయాన్ని తీసుకున్నది. నిర్ణయం తీసుకోవాలనుకున్న టైమ్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ జోక్యం చేసుకుని, ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించినట్లయితే రాష్ట్ర పోలీసు విభాగంపై ప్రజల్లో విశ్వసనీతయ దెబ్బతినే ప్రమాదం ఉన్నదని, పోలీసులు ఆత్మస్థయిర్యం కోల్పోతారని హైకోర్టుకు వివరించారు. అవసరమైతే సీఐడీ దర్యాప్తు జరిపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జరిపిస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను, ఒక ఎస్ఐని విధుల నుంచి తొలగించామని తెలిపారు.

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో ఒక కేసు విషయంలో హాజరైన మరియమ్మ అనుమానాస్పద పరిస్థితుల్లో లాకప్‌లోనే మృతి చెందారు. పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్లనే మృతిచెందినట్లు దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో గత కొన్ని రోజులుగా వాదనలు జరుగతున్నాయి. పది రోజుల క్రితం జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు బెంచ్ సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించడంపై ఆలోచిస్తున్నామని, ఆ శాఖ అభిప్రాయాన్ని కోరుతున్నామని తెలిపారు. అందులో భాగంగా సోమవారం సీబీఐ ఎస్పీ కల్యాణ్ హాజరయ్యారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ కూడా హాజరయ్యారు.

ఇరు పక్షాల వాదనలను పరిగణనలోక తీసుకున్న హైకోర్టు, సీబీఐకి ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగించడంపై ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించకుండా తీర్పును రిజర్వులో ఉంచింది.


Next Story