వొడాఫోన్ రెట్రో కేసు తీర్పుపై సవాలు చేయనున్న భారత్

by  |
వొడాఫోన్ రెట్రో కేసు తీర్పుపై సవాలు చేయనున్న భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: వొడాఫోన్ సంస్థ చెల్లించాల్సిన రూ. 22,100 కోట్ల రెట్రోస్పెక్టివ్ పన్ను కేసులో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ తీర్పును త్వరలో భారత్ సవాలు చేయనుంది. దీనికి సంబంధించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రభుత్వం న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది. స్థానిక పార్లమెంట్ రూపొందించిన చట్టాలను కాదని ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ఇవ్వకూడదని తుషార్ మెహతా తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు రెట్రోస్పెక్టివ్ కేసుకు సంబంధించి వొడాఫోన్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత్ సవాలు చేయనుంది.

ఆదాయపన్ను శాఖ సమానంగా, పారదర్శకంగా చూడ్డంలో విఫలమైందని, వొడాఫోన్‌పై భారత ప్రభుత్వం పన్ను విధంచడం సరైంది కాదని ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీనివల్ల భారత్-నెదర్లాండ్స్ మధ్య ఉన్నటువంటి పెట్టుబడుల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వొడాఫోన్ గ్రూప్ వాదనలు వినిపించింది. ఈ క్రమంలో, వొడాఫోన్ నుంచి వెంటనే బకాయిలను వసూలు చేయడం నిలివేయాలని, అంతేకాకుండా కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 40 కోట్లను చెల్లించాలని ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే పెనాల్టీ, పన్నులు, వడ్డీలను రూ. 22,100 కోట్లను వసూలు చేయడాన్ని ఆపేసింది.

అసలేం జరిగిందంటే…

2007లో భారత్‌లో టెలికాం సేవలను అందించే హచిసన్ ఈక్విటీలో వొడాఫోన్ గ్రూప్ 67 శాతం వాటాను సుమారు రూ. 81 వేల కోట్లకు కొనుగోలు చేసింది. దీనికి గానూ, టీడీఎస్ కింద రూ. 11 వేల కోట్లు చెల్లించాలంటూ ఆదాయపన్ను శాఖ అప్పట్లో వొడాఫోన్ గ్రూపునకు నోటీసులను అందించింది. అయితే, వొడాఫోన్ గ్రూప్ ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమవడంతో జరిమానా, వడ్డీ మొత్తం రూ. 22,100 కోట్లకు చేరుకుంది. ఇందులో రూ. 12,000 కోట్ల వడ్డీ ఉండగా, రూ. 7,900 కోట్ల పెనాల్టీ ఉంది. 2012 జనవరిలో సుప్రీంకోర్టు ఆదాయపన్ను శాఖ డిమాండ్‌ను కొట్టేసింది.

ఈ తీర్పుతో ఆ తర్వాత రెండు నెలలకు కేంద్ర ప్రభుత్వం పాత తేదీలు వర్తించే విధంగా చట్టాన్ని సవరించింది. తిరిగి వొడాఫోన్ గ్రూపునకు పన్ను చెల్లించాలంటూ నోటీసులను జారీ చేసింది. ఈ అంశంపై వొడాఫోన్ గ్రూప్ 2014లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. గత నెలలో ఈ కేసుకు సంబంధించి ఆర్బిట్రేషన్ వొడాఫోన్‌కు సానుకూలంగా తీర్పు ఇచ్చి ఊరట కల్పించింది. తాజాగా, ఈ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం సవాలు చేయడానికి సిద్ధమవుతోంది. భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌తో సంప్రదించనున్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.


Next Story

Most Viewed