రోహిత్ శర్మ కెప్టెన్ కావాలి..మరి విరాట్ కోహ్లీ?

by  |
రోహిత్ శర్మ కెప్టెన్ కావాలి..మరి విరాట్ కోహ్లీ?
X

దిశ, స్పోర్ట్స్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయింది. అంతకుముందు జరిగిన ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టును కూడా కోహ్లీ గెలిపించుకోలేకపోయాడు. అదే సమయంలో రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ జట్టుకు ఐదో టైటిల్ అందించాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైనా జట్టు కోసం బరిలోకి దిగి విజేతగా నిలిపాడు. అప్పటి నుంచే కోహ్లీ, రోహిత్‌ల మధ్య తేడాలను చూపిస్తూ పలువురు క్రికెట్ విశ్లేషకులే కాకుండా అభిమానులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఐపీఎల్ తర్వాత రోహిత్ గైర్హాజరీలో ఆస్ట్రేలియా వెళ్లిన టీమ్ఇండియా వన్డే సిరీస్ కోల్పోవడంతో విమర్శలు మరింత పెరిగాయి.

పరిమిత ఓవర్లకు వద్దు

టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ వ్యక్తిగత రికార్డులను అందుకోవడం అంత సులువైన విషయం కాదు. క్రికెట్ బుక్‌లోని అన్నిరకాల షాట్లు ఆడటంతోపాటు ఛేదనలో రికార్డు సృష్టించిన బ్యాట్స్‌మన్ విరాట్ మాత్రమే. ధోని వారసుడిగా టీమ్ఇండియా పగ్గాలు చేపట్టిన అతను ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు. కానీ, గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్ కప్ నుంచి కోహ్లీపై తీవ్రమైన విమర్శలు చెలరేగుతున్నాయి. మరోవైపు తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీమ్ఇండియాను పలు సిరీసుల్లో గెలిపించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గా కూడా రాణించి ముంబయికి టైటిల్ అందించాడు. ఈ కారణాలతో టీమ్ఇండియా పరిమిత ఓవర్ల జట్టుకు కెప్టెన్‌గా కోహ్లీ వద్దనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేవలం టెస్టు జట్టుకే కెప్టెన్‌గా నియమించి వన్డే, టీ20ల నాయకత్వం రోహిత్‌కు అప్పగించాలని కోరుతున్నారు. అభిమానులే కాకుండా కొంత మంది మాజీ క్రికెటర్లు కూడా రోహిత్ కెప్టెన్సీకి మద్దతు తెలుపుతున్నారు.

ఎందులో తక్కువ?

టీమ్ఇండియాలో చోటు సంపాదించాలంటే టాలెంట్ ఉంటేనే సరిపోదు. కొన్ని దశాబ్దాలుగా వెస్ట్‌జోన్ క్రికెటర్లే ఎక్కువగా చోటు సంపాదించారు. ముఖ్యంగా ముంబయి లాబీయింగ్ బీసీసీఐలో ఎక్కువ ప్రభావం చూపుతుందనేది బహిరంగ రహస్యం. సచిన్ టెండుల్కర్ కెప్టెన్సీ వదులుకున్న తర్వాత వెస్ట్ జోన్ నుంచి మరో క్రికెటర్ సారథి కాలేకపోయాడు. సెహ్వాగ్, గంగూలీ, ధోని, ద్రవిడ్, కుంబ్లే, కోహ్లీ టీమ్ ఇండియాకు కెప్టెన్లుగా ఉన్నారు. వీళ్లంతా ముంబయికి చెందినవాళ్లు కాదు. దీంతో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను కెప్టెన్ చేయడానికే కోహ్లీ ఘనతలను తక్కువ చేసి చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కానీ, కోహ్లీని అంత తక్కువ చేయడం ఎవరితోనూ సాధ్యం కాదని అతడి గణాంకాలే తెలియజేస్తున్నాయి. సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు, పరుగులు చేసిన క్రికెటర్ కోహ్లీనే. అత్యధిక టెస్టు, వన్డే విజయాలు కూడా అతడి పేరిట ఉన్నాయి. కెప్టెన్‌గా ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసింది కూడా కోహ్లీనే. అందుకే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలంటే బీసీసీఐకి కూడా కారణం దొరకడం లేదు.


Next Story

Most Viewed