విదేశీ మార్కెట్​కు మన బియ్యం

by  |
విదేశీ మార్కెట్​కు మన బియ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా పెరిగిందని, దీంతో బియ్యం నిల్వలు కూడా పెరిగాయని, ఈ బియ్యాన్ని విదేశీ మార్కెట్‌లో విక్రయించేందుకు ఉన్న అవకాశాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్​ ఛైర్మన్​ బోయినపల్లి వినోద్​కుమార్ ఎఫ్​టీసీసీఐకి సూచించారు. అందులో భాగంగానే ఎఫ్​టీసీసీఐ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి క్షేత్ర స్థాయి పరిస్థితులను విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించిందన్నారు. “ తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతి – ముందుకు సాగే అవకాశాలు” అనే విషయంపై క్షుణ్ణంగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించిన ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్​టీసీసీఐ) నివేదికను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌కు బుధ‌వారం అందజేసింది.

మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో సమావేశమైన ఎఫ్​టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్ ఇనాని, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కే. భాస్కర్ రెడ్డి, సీఈవో ఖ్యాతి నరవనే, డిప్యూటీ సీఈఓ టీ.సుజాత నివేదిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వినోద్​ కుమార్​ మాట్లాడుతూ….. రాష్ట్రంలో పంట భూములకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్దంగా పలు ప్రాజెక్టులను నిర్మించారని తెలిపారు. పుష్కలంగా నీటి లభ్యతతో రాష్ట్రంలో వరి దిగుబడి పెద్ద ఎత్తున రైతుల చేతికి వచ్చిందన్నారు. రాష్ట్రంలో వరి ఎక్కువగా పండించే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్ వంటి జిల్లాల్లో డ్రై పోర్ట్ లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వరి కొనుగోళ్లు చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సూచించిందన్నారు. తద్వారా రవాణా ఖర్చులను తగ్గించే అవకాశం ఉంటుందని, మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి లేదా జానకంపేటలలో ఇన్లాండ్ కంటేనర్ డిపో ( ఐ.సి.డీ ) ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించారన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో మాత్రమే ఐసీడీ ఉందన్నారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి బియ్యం రవాణా చేయాలంటే ర‌వాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతాయని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం కొంకోర్ సబ్సిడీని సనత్ నగర్ ఐసీడీకి వర్తింపజేయాలని సూచించారు. క్రిమిసంహారక మందుల వినియోగం పట్ల రైతులకు జాగ్రత్తలు చెప్పి వారిని చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అధ్యయన బృందం అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రం వాతావరణ సమశీతోష్ణస్థితి కలిగి ఉండటం కలిసి వచ్చే అంశమని, రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో రైతులు పండించిన ” తెలంగాణ సోనా ” రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ గా మారిందని నివేదికలో పేర్కొన్నారు.


Next Story