‘దిశ’ ఎఫెక్ట్.. అక్రమ టెండర్ రద్దు చేయాలని గ్రామస్తుల ధర్నా

by  |
‘దిశ’ ఎఫెక్ట్.. అక్రమ టెండర్ రద్దు చేయాలని గ్రామస్తుల ధర్నా
X

దిశ, కామారెడ్డి రూరల్ : కల్లు దుకాణం టెండర్ గ్రామస్తులకు తెలియకుండా రహస్యంగా నిర్వహించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. బుధవారం ‘దిశ’లో వచ్చిన ‘రహస్యంగా కల్లు మామూలు టెండర్’ అనే కథనానికి గ్రామస్తులు స్పందించారు.

ఈ క్రమంలో ఇస్రోజివాడి గ్రామపంచాయతీ ఎదుట బైఠాయించి సర్పంచ్ కొత్త మమత భర్త రాజుతో పాటు VDCలోని కొంతమంది సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో కాకుండా చాటుమాటుగా దాబా హోటల్‌లో టెండర్ నిర్వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓవైపు మంత్రి కేటీఆర్ సర్పంచ్‌ల భర్తలు అధికారం చెలాయించవద్దని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, అలా చేస్తే కేసులు నమోదు చేయడంతోపాటు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం విధితమే. అయినప్పటికీ ఇస్రోజివాడిలో మాత్రం సర్పంచ్ భర్త అవేమీ పట్టించుకోకుండా అధికారిక కార్యక్రమాలతో పాటు అనధికారిక కార్యక్రమాల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు.

ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామంలో కల్లు టెండర్ వేయవద్దని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించినా అవేమీ పట్టించుకోకుండా గ్రామంలో కాకుండా దాబా హోటల్‌లో రహస్యంగా 5 లక్షల రూపాయలకు టెండర్ నిర్వహించారు. కాగా ఇందులో పాల్గొన్న కొంతమంది వీడీసీ సభ్యులతో పాటు సదరు సర్పంచ్ భర్త కూడా ముడుపులు తీసుకొని గ్రామస్తులకు తెలియకుండా రహస్య టెండర్ నిర్వహించినట్టు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు నిర్వహించిన టెండర్‌ను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed