దర్శకుడి వీక్‌నెస్‌తో ఆడుకున్న సైబర్ నేరగాళ్లు.. లక్షల్లో టోకరా!

145

దిశ, సినిమా : యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ‘భీష్మ’ చిత్రంతో సక్సెస్ అందుకుని టాలీవుడ్‌ క్రేజీ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. నితిన్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రాన్ని బేస్ చేసుకునే డైరెక్టర్‌ను టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు నామినేషన్ అంటూ కథలు చెప్పి.. దాదాపు రూ. 70 వేల వరకు లాగేశారు. విషయం ఏంటంటే.. రైతు, వ్యవసాయం నేపథ్యంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం చాలా బాగుందని, ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు నామినేట్ చేయాలని సైబర్ నేరగాళ్లు డైరెక్టర్‌కు కాల్ చేశారు. ఆరు కేటగిరీల్లో నామినేషన్ వేయాలని, ఒక్కో కేటగిరీకి రూ.11 వేల చొప్పున చెల్లించాలని కోరారు. ఇదంతా నిజమే అనుకుని.. వారు చెప్పిన ఎకౌంట్‌కు రూ. 66 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు వెంకీ. ఆ తర్వాత మళ్లీ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మూడు కేటగిరీల్లో నామినేషన్ ఓకే అయిందని, మిగతా వాటి ప్రాసెసింగ్‌లో ప్రాబ్లమ్ వచ్చిందని, మళ్లీ రూ. 33వేలు ఎకౌంట్‌లో యాడ్ చేయాలని కోరారు. అప్పుడు వెంకీకి డౌట్ రావడంతో, సినిమా నిర్మాతలు నామినేషన్స్ వద్దన్నారని సైబర్ నేరగాడికి అనుమానం రాకుండా మాట్లాడి.. వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు. కాగా నేరస్తుడు యూజ్ చేసిన ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఎకౌంట్ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..